icon icon icon
icon icon icon

మూడుసార్లు ఎమ్మెల్యే.. తిరిగింది రిక్షాలోనే

ఈరోజుల్లో డివిజన్‌ కార్పొరేటర్‌ అయితే చాలు విలాసవంతమైన వాహనం, వ్యక్తిగత సహాయకుడు, ఎక్కడికెళ్లిన ప్రొటోకాల్‌ హంగామా ఉంటుంది. 

Updated : 16 Nov 2023 11:50 IST

ఆదర్శ నేత నాగభూషణ్‌రావు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : ఈరోజుల్లో డివిజన్‌ కార్పొరేటర్‌ అయితే చాలు విలాసవంతమైన వాహనం, వ్యక్తిగత సహాయకుడు, ఎక్కడికెళ్లిన ప్రొటోకాల్‌ హంగామా ఉంటుంది.  కానీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు సొంత వాహనం లేదు. నగరంలో ఎక్కడికెళ్లినా రిక్షాలోనే ప్రయాణం. శాసనసభకు వెళ్లాలంటే రైలు లేదా ఆర్టీసీ బస్సులోనే. ఇది దివంగత నేత బండారు నాగభూషణ్‌రావు ఆదర్శం.

ఇదీ నేపథ్యం..: వరంగల్‌ నగరంలోని కృష్ణకాలనీకి చెందిన బండారు  నాగభూషన్‌రావు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి జైలుకెళ్లారు. ఉన్నత విద్యావంతులు కూడా. అప్పట్లోనే డబుల్‌ పీజీ, బీఎడ్‌ చేసిన ఆయన 1961 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేశారు.  శషిరేఖను ఆదర్శ వివాహం చేసుకున్నారు. సంతానం కలగక పోవడంతో సమీప బంధువు అయిన ఫణిభూషణ్‌రావును దత్తత తీసుకున్నారు. అజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకుడిగా దీర్ఘకాలం పనిచేశారు. ఈయనకు కార్మిక బంధు అన్న పేరుకూడా ఉంది. కార్మిక సంఘం నాయకుడిగా.. అప్పట్లో ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావుతో మాట్లాడి అజంజాహి మిల్లు (ఏజే మిల్లు)లో ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయించారు.

రాజకీయ ప్రస్థానం..: అజంజాహీ మిల్లు కార్మిక నేతగా పేరున్న నాగభూషణ్‌రావు తొలిసారిగా వరంగల్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి  1962లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మిర్జాబేగ్‌పై విజయం సాధించారు.

  • 1967లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థ టీఎస్‌.మూర్తి చేతిలో ఓడిపోయారు. కార్మికుల్లో ఆయనకున్న పేరును చూసి తెదేపా అధినేత ఎన్టీ రామారావు పట్టుబట్టి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెదేపా తరఫున 1983లో భూపతి కృష్ణమూర్తి (భాజపా)పై, 1985 ఎన్నికల్లో అబ్దుల్‌ ఖాదర్‌(కాంగ్రెస్‌)పై గెలుపొందారు.
  • వరంగల్‌ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకులు పలు చర్యలు తీసుకున్నారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, బస్టాండుల్లో జేబు దొంగలను గుర్తించి.. వారితో మాట్లాడి, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారనే పేరుంది.

సాధారణ జీవితం..: మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నాగభూషణ్‌రావు సాధారణ జీవితం గడిపారు. సొంత వాహనం కూడా లేకపోయింది. హైదరాబాద్‌లో శాసనసభ సమావేశాలు, ఇతర ముఖ్యమైన సమావేశాలకు రైలు లేదా ఆర్టీసీ బస్సులో వెళ్లే వారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఏదైనా పని కోసం హైదరాబాద్‌కు వస్తే దగ్గరుండి చేయించే వారు.

  • 1984లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఏర్పడింది. తొలి ఛైర్మన్‌గా బండారు నాగభూషణ్‌రావు పనిచేశారు.
  • రంగశాయిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హంటర్‌రోడ్‌ చిన్న వంతెన, ఉర్సు ప్రసూతి ఆసుపత్రిని ఆయనే మంజూరు చేయించినట్లు తెదేపా కార్యకర్తలు చెబుతుంటారు.
  • 2000 సంవత్సరంలో వరంగల్‌లోనే మృతి చెందారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img