logo

వైద్య కళాశాల నిర్మాణం జరిగేనా..?

ములుగు జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు గందరగోళంగా ఉంది. అధికారులు తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నా.. శాశ్వత భవన నిర్మాణమనేది ప్రశ్నార్థకంగా మారింది.

Published : 16 Apr 2024 04:32 IST

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు గందరగోళంగా ఉంది. అధికారులు తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నా.. శాశ్వత భవన నిర్మాణమనేది ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణం జరుగుతుందా అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో ములుగు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కు ఆనుకొని ఉన్న ప్రదేశంలో నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయా పైసా పని జరగలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శిలాఫలకం వేసి ఐదు నెలలు కావస్తున్నా.. దాని ఊసే లేదు.

రూ.180 కోట్లతో శంకుస్థాపన

గత ప్రభుత్వంలో రూ.180 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి అప్పటి వైద్యశాఖ మంత్రి శిలాఫలకాన్ని వేశారు. తరగతి గదులు, విద్యార్థులకు వసతి గృహాలు, ప్రత్యేక ల్యాబ్‌లు, ఇతర అవసరాలకు సంబంధించిన నిర్మాణాల కోసం ఈ నిధులు కేటాయించారు. నిధుల విడుదల కాలేదు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ రావడంతో.. టెండరు కూడా నిర్వహించలేదు. ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, నిధుల కేటాయింపు జరిగి నిర్మాణానికి ప్రత్యేక అంచనాలు తయారు చేసి సాంకేతికపరమైన అనుమతులు పొందిన తర్వాత టెండరు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో.. మళ్లీ మొదటికి వచ్చింది.

కోర్టు వివాదంలో కొంత స్థలం

కళాశాలకు కేటాయించిన స్థలానికి సంబంధించి కోర్టు కేసులున్నాయి. కొందరి ఆధీనంలో ఉన్న స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు తీసుకునేందుకు ప్రయత్నించగా, సదరు భూ యజమానులు కోర్టును ఆశ్రయించారు. దాంతో పాటు వైద్య కళాశాలకు కేటాయించిన స్థలంలో కొన్ని నివాస గృహాలు కూడా ఉన్నాయి. వీటిని తొలగించడానికి ప్రయత్నించడంతో వారు కూడా కోర్టును ఆశ్రయించారు. దీంతో మూడు కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. కేసుల పరిష్కారం కానంత వరకు ఇక్కడ పనులు చేపట్టడానికి వీలులేని పరిస్థితి నెలకొంది.


భవన నిర్మాణానికి జీవో విడుదలైంది

- వెంకటేశ్‌, ఈఈ, ఆర్‌అండ్‌బీ, ములుగు

కళాశాల నూతన భవన నిర్మాణానికి గత శాసనసభ ఎన్నికలకు ముందు జీవో విడుదలైంది. ఆ తర్వాత కోడ్‌ రావడంతో.. ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలు తయారు చేయలేదు. అంచనాలు రూపొందించడానికి కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించాం. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండరు ప్రక్రియను నిర్వహిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని