logo

ప్రైవేటు కొనుగోళ్లపై వీడిన ఉత్కంఠ

మార్కెట్లో ప్రైవేటు వ్యాపారుల ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండు, నిరసనలు ఒక వైపు.. మద్దతు ధరతోనే క్రయ, విక్రయాలు జరగాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలుపై అధికారుల సందిగ్ధతతో జనగామ మార్కెట్లో సోమవారం ఉత్కంఠ నెలకొంది.

Published : 16 Apr 2024 04:48 IST

జనగామ, న్యూస్‌టుడే: మార్కెట్లో ప్రైవేటు వ్యాపారుల ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండు, నిరసనలు ఒక వైపు.. మద్దతు ధరతోనే క్రయ, విక్రయాలు జరగాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలుపై అధికారుల సందిగ్ధతతో జనగామ మార్కెట్లో సోమవారం ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11 నుంచి 14 వరకు ప్రైవేటులో విక్రయానికి వచ్చిన 25 వేల బస్తాల ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రైతుల కోసం మార్కెట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన మూడు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతోనే అమ్ముకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ధాన్యం ఆరబోసి, శుభ్రం చేయడానికి స్థలం లేకపోవడంతో తేమ శాతాన్ని అనుసరించి మద్దతు ధరకు అటుఇటుగా ఖరీదు చేయించాలని రైతులు డిమాండ్‌ చేశారు. అన్నదాతలు అనేక పర్యాయాలు మార్కెటింగ్‌, రెవెన్యూ ఇతర ప్రత్యేక అధికారులకు తమ ఇబ్బందులను వివరించారు. విసుగు చెంది మార్కెట్‌ కార్యాలయం ముందు గడ్డి తగులబెట్టి నిరసన తెలిపారు. కొందరు రైతులు జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి మాట్లాడారు. మరికొందరు ధాన్యాన్ని తిరిగి ట్రాక్టర్లకు ఎత్తి తీసుకువెళ్లారు.

నాలుగు రోజులుగా మార్కెట్లో రాశులుగా పోసిన ధాన్యం ముక్కిపోతోందని, మొలకలెత్తుతోందని రైతులు వాపోయారు. దీనిపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు.. వ్యాపార సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. మద్దతు ధర ప్రమాణాలు, మార్కెట్లో నిలిచిపోయిన ధాన్యం నాణ్యతను బేరీజు వేసుకొని, మధ్య మార్గంగా ధరలు నిర్ణయించి ఖరీదు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మార్కెట్లో ప్రస్తుతం ధాన్యం తేమ 25 నుంచి 58 శాతం వరకు ఉందని పరిశీలనలో వెల్లడైంది. కనీసంగా రూ.1650, గరిష్ఠంగా క్వింటాలుకు రూ.2 వేల ధరతో ఖరీదుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. వ్యాపారులు నిర్ణయించే ధర ఆమోదం కాని పక్షంలో రైతులు శుభ్రపర్చి ఎంఎస్పీ కేంద్రాల్లో విక్రయించుకోవచ్చునని వారికి నచ్చజెప్పగా రైతులు వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని