logo

గెలిపించేది ఆమె

ఉమ్మడి వరంగల్‌లో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు వరంగల్‌, మహబూబాబాద్‌ స్థానాల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

Updated : 16 Apr 2024 05:32 IST

ఈనాడు, మహబూబాబాద్‌: ఉమ్మడి వరంగల్‌లో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు వరంగల్‌, మహబూబాబాద్‌ స్థానాల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గెలుపోటముల్లో వీరే కీలకమని గుర్తించిన పార్టీలు ఇప్పటి నుంచే వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గతేడాది నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల ఓటింగ్‌లోనూ అతివలు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాను చాటుకున్నారు. మే 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ వీరే కీలకం కాబోతున్నారు.

పోటీకి సైతం సిద్దం..

రాజకీయ పార్టీలు మహిళలకు పోటీ చేసే అవకాశాలు అంతంతమాత్రమే కల్పిస్తునాయి. అయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. రానున్న రోజుల్లో 33శాతం రిజర్వేషన్లు అమలైతే అవకాశాలు వారికి తలుపు తట్టనున్నాయి.    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1952 నుంచి 2019 వరకు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముగ్గురు మహిళలు మాత్రమే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ముగ్గురిలో 1984లో వరంగల్‌ స్థానానికి తొలిసారిగా తెదేపా నుంచి పోటీ చేసిన టి.కల్పనాదేవి గెలిచారు. ఆ తర్వాత 1989, 1999లో ఆమె ఓడారు. 2008లో హనుమకొండ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేసి ఓడారు. 2019లో మహబూబాబాద్‌ స్థానం నుంచి భారాస అభ్యర్థిగా మాలోత్‌ కవిత పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మహబూబాబాద్‌ స్థానం నుంచి భారాస అభ్యర్థిగా మాలోత్‌ కవిత పోటీ చేసేందుకు ఆయా పార్టీలు అవకాశం ఇచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18  నుంచి ప్రారంభం కానుంది.. ఈ తర్వాతే ఎంత మంది మహిళలు ఈసారి బరిలో ఉంటారనేది తేలుతుంది.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాలున్నాయి.

  • వరంగల్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18,16,543 మంది ఓటర్లు ఉన్నారు. 8,91,940 మంది పురుషులు, 9,24,208 మంది మహిళలు, 395 మంది ఇతరులు ఉంటారు. ఈ లోక్‌సభ స్థానంలో పురుషుల కంటే 32,268 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు.
  • మహబూబాబాద్‌ స్థానంలో 15,28,255 మంది ఓటర్లు ఉన్నారు. 7,46,019 మంది పురుషులు, 7,82,131 మంది మహిళలు, 105 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషుల కంటే 36,112 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఈ నెల 25న ప్రకటించే అనుబంధ ఓటరు జాబితాతో ఓటర్ల సంఖ్య మరింత పెరగనుంది.

శాసనసభ ఎన్నికల స్ఫూర్తిని ఈసారి చాటాలి

2023 నవంబరు 30న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళలే కీలకంగా మారారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ శాసనసభ ఎన్నికల స్ఫూర్తి చాటి ఓటింగ్‌ శాతాన్ని పెంచి మరోసారి అభ్యర్థుల గెలుపులో తమ శక్తిని నిరూపించుకోవాలి.

  • వరంగల్‌ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో 6,91,902 మంది పురుషులు, 7,01,862 మంది మహిళ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన వారిలో పురుషుల కంటే 9,960 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు.
  • మహబూబాబాద్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 6,13,646 మంది పురుషులు, 6,29,360 మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంటే పురుషుల కంటే ఎక్కువగా 15,714 మంది మహిళా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని