logo

‘భాజపా, భారాసలది అంతర్గత దోస్తానం’

భాజపా, భారాసలు అంతర్గత దోస్తానం చేస్తూ.. బహిరంగంగా దుష్మన్‌గా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం తప్పదని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి అన్నారు.

Published : 17 Apr 2024 04:38 IST

ప్రసంగిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, చిత్రంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, యశస్వినిరెడ్డి,  ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తదితరులు

నయీంనగర్‌, న్యూస్‌టుడే: భాజపా, భారాసలు అంతర్గత దోస్తానం చేస్తూ.. బహిరంగంగా దుష్మన్‌గా వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం తప్పదని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ఓ వేడుకల మందిరంలో ఉమ్మడి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోహిత్‌చౌదరి పాల్గొని ప్రసంగించారు. భాజపా గత పదేళ్లుగా నిరుద్యోగ యువతను విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్యపై భాజపా అభ్యర్థి ఆరూరి రమేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, ఉరికించి కొడతారని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని, ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేస్తున్నారని చెప్పారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రసంగిస్తూ.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న భాజపాను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న భాజపా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, కనీసం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశస్వినిరెడ్డి ప్రసంగించారు. టీపీసీసీ, జిల్లా నాయకులు బత్తిని శ్రీనివాస్‌, ఈవీ.శ్రీనివాస్‌, కత్తి వెంకటస్వామిగౌడ్‌, నమిండ్ల శ్రీనివాస్‌, రామకాంత్‌రెడ్డి, బంక సరళ, కార్పొరేటర్లు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.

యశస్వినిరెడ్డికి ఘన స్వాగతం..: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. వేదికపై ఆమె మాట్లాడుతున్న సమయంలో యువత కేరింతలు కొట్టారు. యూత్‌ ఐకాన్‌ యశస్విని అంటూ నినాదాలు చేశారు. వేదిక ముందు చేరి సెల్ఫీలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని