logo

‘రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన భారాస’

‘సంపద కలిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇస్తే అధికారంలోకి వచ్చిన భారాస పెద్దలు దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్ప చేశారు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 18 Apr 2024 05:55 IST

మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ‘సంపద కలిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇస్తే అధికారంలోకి వచ్చిన భారాస పెద్దలు దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్ప చేశారు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితుడయ్యాక మొదటిసారి మహబూబాబాద్‌కు వచ్చిన నరేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన కోసం సభావేదిక, హెలీప్యాడ్‌ స్థలాన్ని నరేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే ఇచ్చిన హామీలను క్రమేణా అమలుచేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే ఈ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ల్యాండ్‌, మైనింగ్‌తో అక్రమ వ్యాపారాలు చేయడమేగాకుండా ప్రాజెక్ట్‌లు, పథకాల పేరుతో రూ.ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. భారాస నేతలు భూకబ్జాలు, అక్రమ మైనింగ్‌ లాంటి అక్రమ వ్యాపారాలుచేస్తే సహించేది లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ భారీ మెజార్టీతో గెలువబోతున్నారన్నారు. రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్‌దే విజయమన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా బలరాంనాయక్‌ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. బలరాంనాయక్‌ నామినేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 19న మహబూబాబాద్‌కు వస్తున్నారన్నారు. కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. తన సొంత జిల్లా అయినందున ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వం విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చుక్కల ఉదయచందర్‌, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నూనావత్‌ రాధ, పట్టణ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని