logo

నేర నియంత్రణకు సైబర్‌ వారియర్స్‌

ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు.

Updated : 19 Apr 2024 05:09 IST

ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్‌ నేరాలు హెచ్చుమీరుతున్నాయి. పలు రకాల ఆఫర్లు, ప్రలోభాల పేరిట అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించడానికి పోలీసు శాఖ ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ‘సైబర్‌ వారియర్స్‌’ పేరిట సిబ్బందిని అందుబాటులోకి తెచ్చింది.

న్యూస్‌టుడే, ములుగు టౌన్‌

 సైబర్‌ మోసానికి గురైన బాధితులు టోల్‌ ఫ్రీ నెంబరులో ఫిర్యాదు చేస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న తర్వాత ఎంత త్వరగా సమాచారం ఇవ్వగలిగితే అంతే వేగంగా నేర నియంత్రణకు వీలుంటుంది. ఆలస్యమైతే పరిస్థితి జఠిలమే. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది బాధితులు టోల్‌ ఫ్రీ నెంబరును ఆశ్రయిస్తుండటంతో.. సహాయ కేంద్రాల సంఖ్యను పెంచారు. అయినప్పటికీ.. విపరీతమైన ఫోన్‌ కాల్స్‌ పెరిగిపోయాయి. దీంతో సత్వర సేవలను అందించేందుకు పోలీసు శాఖ సిబ్బందిని ఎంపిక చేసి రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ వారియర్స్‌ను సిద్ధం చేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జిల్లా పరిధిలో 40 ఫిర్యాదులు అందాయి. బాధితులు రూ.19.68 లక్షలు మోసపోయారు. ఇప్పటివరకు 12 ఫిర్యాదులకు సంబంధించి రూ.3.35 లక్షలు పోలీసులు రికవరీ చేశారు.  

ప్రత్యేక విభాగం ఏర్పాటు

జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌తో నేర నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీరు రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఇందులో ఒక డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు పోలీసు సిబ్బంది ఉంటారు. వీరు సైబర్‌ మోసాలపై అవగాహన సదస్సులతో ప్రజలను అప్రమత్తం చేస్తారు. మోసానికి గురై డబ్బు కోల్పోయిన బాధితులకు తిరిగి పొందడంలో.. సాయం చేస్తారు.

హైదరాబాద్‌లో శిక్షణ

ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ప్రతి ఠాణాలో ఒక సైబర్‌ వారియర్‌ను నియమించారు. జిల్లా పరిధిలో  మొత్తం పది పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వీరికి హైదరాబాద్‌లో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అందరికి సిమ్‌ కార్డులు, చరవాణులు అందజేశారు. స్టేషన్ల వారీగా ఆ నంబర్లు అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నారు.

ఏం చేస్తారంటే..

సైబర్‌ నేరాలకు సంబంధించి ఎలాంటి కేసులున్నా వీరిని సంప్రదిస్తే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తారు. అదే సమయంలో కేసుల ప్రస్తుత పరిస్థితిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఎవరైనా 1930కి కాల్‌ చేసినా.. అక్కడి నుంచి బాధితులున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సైబర్‌ వారియర్స్‌కు సమాచారం అందుతుంది. దీంతో వారు ఏం చేయాలో బాధితులకు సూచిస్తారు.


లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలి :  శబరీష్‌, ఎస్పీ

సైబర్‌ నేరగాళ్లు ప్రస్తుతం పార్ట్‌టైం ఉద్యోగాలు, బెట్టింగ్‌, ఆన్‌లైన్‌లో పెట్టుబడి, ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. లింకులు పంపిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తారు. ఓటీపీలు చెప్పడం, లింకుల జోలికి వెళ్లడం వంటివి చేయకూడదు. ఇతరులకు డబ్బులు పంపే క్రమంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. సైబర్‌ మోసాలకు గురైతే ఆందోళన చెందకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని