logo

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది.

Published : 25 Apr 2024 04:16 IST

మానుకోట, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. బాలురు 41.87, బాలికలు 66.44 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 65.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 17వ స్థానంలోనే నిలిచింది. బాలురు 52.94, బాలికలు 75.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. వృత్తి విద్య ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయిగా ఉన్నారు. వృత్తి విద్య ప్రథమ సంవత్సరంలో జిల్లా 45.9 శాతం ఉత్తీర్ణతను పొంది రాష్ట్రంలో 28వ స్థానం పొందింది. బాలురు 21.51, బాలికలు 65.21 శాతం అలాగే ద్వితీయ సంవత్సర వృత్తి విద్యలో జిల్లా 56.49 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. బాలురు 31.08, బాలికలు 75.64 శాతం ఉత్తీర్ణతను సాధించారు. గంగారం మండలం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు వరసగా రెండో సంవత్సరం వందశాతం ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచింది.


ఒక మెట్టు పైకి..

గత విద్యా సంవత్సరం (2022-23) జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 64 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచారు. ఈ విద్యాసంవత్సరంలో (2023-24) 65.14 ఉత్తీర్ణతతో 17వ స్థానంలో పొందారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో గత సంవత్సరం 53 శాతం ఉత్తీర్ణతతో 22వ స్థానంలో ఉంటే ఈసారి 55.72 శాతంతో 17వ స్థానంలో మెరుగ్గా నిలిచింది. వృత్తివిద్య ఫలితాల్లో గత సంవత్సరం కంటే వెనకబడింది. 2023లో వృత్తివిద్యలో ప్రథమ సంవత్సర ఉత్తీర్ణతలో  రాష్ట్రంలో 27వ స్థానంలో ఉండగా ఈసారి 28, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో గత ఏడాది 26వ స్థానంలో ఉండగా ఈసారి 30వ స్థానానికి పడిపోయింది.


కారణాలేమిటి..?

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రత్యేక అధ్యయన తరగతులు, లఘు పరీక్షల నిర్వహణలాంటి చర్యలను చేపడుతున్నారు. అధ్యాపకుల కొరత కూడా ఇటీవల చాలా వరకు తగ్గింది. కళాశాలల్లో సౌకర్యాలు కూడా కొంతమేరకు పెరిగాయి. ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉండడం లేదు. కొవిడ్‌ కాలంలో తరగతులు జరగక ప్రధానంగా పాఠశాల విద్యపై దాని ప్రభావం పడడం పర్యవసానంగా ఆ తర్వాత కాలంలో ఇంటర్మీడియట్ విద్యపై కూడా ఆ ప్రభావం చూపడం కొందరు కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ముఖ్యంగా బాలురు సరిగా తరగతులకు హాజరుకావడం లేదని ఇతర జీవనోపాధి పనులకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు. జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తే గైర్హాజరు పరిస్థితి తగ్గుతుందనే భావన వ్యక్తం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని