logo

లోక్‌సభ ఎన్నికలకు భారీ భద్రత

జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు.

Updated : 07 May 2024 07:13 IST

ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు. పోలింగ్‌ మెటీరియల్‌, సిబ్బంది సురక్షితంగా చేరుకున్నప్పుడే యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్‌ జిల్లాలో సాయంత్రం 4 గంటల్లోగా పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

ములుగు, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టు ప్రభావితం ఎక్కువగా ఉన్న ములుగు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే పోలీసు పాత్ర కీలకం. ఇందులో భాగంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. వారు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉండటంతో.. గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

రెండు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రెండు అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్తపల్లి ట్రాక్‌, పేరూరు ఠాణా పరిధి లేకులగూడెంలో వీటిని ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఐదు  అంతర్‌జిల్లా చెక్‌ పోస్టులు అందుబాటులోకి తెచ్చారు. ములుగు మండలం మల్లంపల్లి, వెంకటాపూర్‌ మండలం వెల్తుర్లపల్లి, గుర్రంపేట, మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, వెంకటాపురం మండలం ఎదిర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసి నెల రోజులుగా తనిఖీలు ముమ్మరం చేశారు.

నిరంతరం తనిఖీలు

జిల్లా ప్రత్యేక బలగాలు, సీఏఎస్‌ఎఫ్‌, గ్రేహండ్స్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ అధికారులతో భాగస్వాములవుతున్నారు. మాజీ నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర ఉన్నవారు, అనుమానితులను బైండోవర్‌ చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ శబరీష్‌ స్వయంగా సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి నిర్భయంగా ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు కంపనీల కేంద్ర బలగాలు జిల్లాలో మోహరించి ఉన్నాయి. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రప్పించేందుకు ప్రణాళిక రూపొందించారు.

  • జిల్లాలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 311
  • సాధారణ కేంద్రాలు: 139
  • సమస్యాత్మ కమైనవి : 57
  • నక్సల్స్‌ ప్రభావితమున్నవి : 115
  • కేంద్ర పోలీసు బలగాలు:  250 మంది
  • సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న కేంద్రాలు: 258

మూడంచెల వ్యవస్థ

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సరిహద్దు, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. గ్రేహండ్స్‌, ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసులు, బాంబ్‌ స్క్యాడ్‌ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. జిల్లాలో 139 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు, 57 సమస్యాత్మకవి, 115 నక్సల్స్‌ ప్రభావితనవిగా గుర్తించాం. సమస్యాత్మక, నక్సల్స్‌ ప్రభావిత కేంద్రాల వద్ద మూడంచెల వ్యవస్థను సిద్ధం చేశాం. ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా ఓటర్లను చైతన్యం చేస్తున్నాం.

శబరీష్‌, ఎస్పీ

 అన్ని ఏర్పాట్లు చేశాం..

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నాం. వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీటి వసతితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండు కి.మీ. దూరంలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి నుంచి ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్‌ శాతం పెంచేందుకు స్వీప్‌ ద్వారా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాం.

ఇలా త్రిపాఠి, కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని