logo

‘నన్ను, రాజయ్యను జైల్లో పెట్టాలని చూస్తున్నారు’

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Published : 07 May 2024 07:04 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌,  రఘునాథపల్లి, న్యూస్‌టుడే : స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లిలో ఓ వేడుక మందిరంలో సోమవారం నిర్వహించిన ఘన్‌పూర్‌, చిల్పూర్‌ మండలాల భారాస కార్యకర్తల వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం, రఘునాథపల్లి మండల భారాస కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. పల్లా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోజూ రాజయ్య, నేను తిరుగుతూ శ్రీహరి మోసాన్ని ప్రజలకు వివరిస్తుంటే నిద్రపట్టక కడియం పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. పల్లాను, తాటికొండ రాజయ్యను ఎలాగైనా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరికి వెళ్లి బతిమాలుతున్నాడని చెప్పారు. కడియం ఎన్ని గిమ్మిక్కులాడినా.. భయపడేది లేదన్నారు. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకునే కడియం ఎక్కడైనా ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా..? అని ప్రశ్నించారు.

జడ్పీ ఛైర్మన్‌ మృతికి కడియమే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మృతికి ఎమ్మెల్యే కడియం శ్రీహరే ప్రధాన కారకుడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ సభ పేరుతో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంపత్‌రెడ్డిని నిలబెట్టి నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడివి, జడ్పీ ఛైర్మన్‌వి నీ గ్రామంలో పార్టీకి తక్కువ ఓట్లు ఎలా వస్తాయని మానసికంగా క్షోభకు గురిచేస్తే.. ఆ బాధను తట్టుకోలేని సంపత్‌రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందాడని చెప్పారు. సంపత్‌రెడ్డి సంతాప సభలోనూ రాజకీయాలు మాట్లాడుతూ.. ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి.. తిరిగి అదే పార్టీలో చేరిన నయవంచకుడు కడియం అని విమర్శించారు. ఉప ఎన్నికల్లో చూసుకుందాం.. నీకు డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తానని వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని