logo

ప్రశాంత పోలింగ్‌కు పక్కా ఏర్పాట్లు

లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి వద్ద ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్‌ ఏర్పాట్లపై దృష్టి సారించారు.

Published : 07 May 2024 07:10 IST

జనగామ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి వద్ద ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్‌ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఓటర్లకు పోల్‌ చిట్టీల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చింది. కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. డీసీపీ సీతారాం ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో జనగామ శాసనసభ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉండగా, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలు వరంగల్‌ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. వీటి పరిధిలో ఈ నెల 13న పోలింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళిక, కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు.

మూడు నియోజక వర్గాల్లోని ఓటర్లలో విశ్వాసం కల్పించేందుకు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాల్లో కమ్యునిటీ పోలీసింగ్‌ పేరిట ప్రత్యేక సమావేశాల ద్వారా కౌన్సిలింగ్‌ జరిపారు. శాసనసభ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగడంతో 33 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు లేవు. సాధారణ, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 869 పోలింగ్‌ కేంద్రాలకు గాను 74 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 436 పోలింగ్‌ కేంద్రాల్లో 162 సీసీ కెమెరాలను అమర్చారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణను ఏర్పాటు చేశారు.

ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులో భాగంగా పోలీసులు రూ.28.99 లక్షలు, ఎస్‌ఎస్టీ రూ.4.61 లక్షలు, ఎఫ్‌ఎస్టీ బృందం రూ.7.80 లక్షలు పట్టుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో రూ.18.27 లక్షల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్‌ విభాగం రూ.3.10 కోట్ల విలువైన మద్యం పట్టుకొని, 161 కేసులను నమోదు చేశారు. ఇందులో ఎంసీసీ ఉల్లంఘనలో ఐదు కేసులు నమోదయ్యాయి. 1197 మందిని బైండోవర్‌ చేశారు.


గత ఎన్నికల నేపథ్యంలో

శాసనసభ ఎన్నికల్లో జనగామ నియోజవకర్గ పరిధిలో, ముఖ్యంగా పట్టణంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.


శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు..
- డీసీపీ సీతారాం

పోలింగ్‌ సందర్భంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గత ఎన్నికల దృష్ట్యా ఈ సారి ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక పోలీసు బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 1000పైన ఓటర్లున్న కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం.

పోలీసు బందోబస్తు ఇలా: డీసీపీ-1, డీఎస్పీలు-3, సీఐలు 22, ఎస్‌ఐలు-23, ఏఎస్‌ఐ/హెచ్‌సీ-203, పీసీలు-955, హోంగార్డులు-365. అలాగే రాష్ట్ర ప్రత్యేక పోలీసులు(టీఎస్‌ఎస్పీ)-24 సెక్షన్లు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏఎస్‌ఎఫ్‌) 36.5 సెక్షన్ల బలగాలు అవసరమని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని