logo

పల్లె పోరుకు సై

పంచాయతీ ఉప ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి సారి పల్లెపోరులో        తెరవెనుక పావులు కదిపే నాయకులు ఈ సారి బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారికి ఆర్థిక దన్నుగా నిలబడ్డారు.

Updated : 19 Aug 2023 06:33 IST

 

 నేరుగా రంగంలోకి నేతలు
 జోరుగా మద్యం, సొమ్ముల పంపకం

పంచాయతీ ఉప ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి సారి పల్లెపోరులో తెరవెనుక పావులు కదిపే నాయకులు ఈ సారి బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారికి ఆర్థిక దన్నుగా నిలబడ్డారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేదాకా వచ్చారు. వైకాపా నాయకులు అక్కడితో ఆగకుండా ప్రజలను బెదిరించి..బుజ్జగించి..ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా తమవైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈనాడు, ఏలూరు

ఉమ్మడి జిల్లాలో పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలం వణుదుర్రు, ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం, ఇరగవరం మండలం కావలిపురం పంచాయతీల్లో శనివారం సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 31 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో నాయకులు తెరవెనక మంత్రాంగం నడిపిస్తారు. బాధ్యతలన్నీ ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగిస్తారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ ప్రాబల్యం చూపేందుకు నాయకులే రంగంలోకి దిగారు. పెదపాడు మండలం వీరమ్మకుంటలో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఒకే రోజు పంచాయతీ ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామం మొత్తం తిరిగి తాము బలపరిచిన అభ్యర్థులకే ఓటెయ్యాలని అభ్యర్థించారు. అదే రోజు అబ్బయ్యచౌదరితో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మశ్రీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అడవినెక్కలంలో సర్పంచి చనిపోవటంతో వారి కుటుంబ సభ్యులకే ఏకగ్రీవంగా పదవి అప్పగించాలని గ్రామస్థులు ప్రయత్నించగా అక్కడ తెదేపా, వైకాపా నియోజకవర్గ స్థాయి నేతలు పట్టుపట్టి అభ్యర్థులను పెట్టి ఎన్నికల నిర్వహించేలా చేశారు. ఎలాగైనా తాము బలపరిచిన అభ్యర్థులే గెలవాలన్న లక్ష్యంతో వారం నుంచి వ్యూహాలు రచిస్తున్నారు:

బెదిరింపులు, ప్రలోభాలు

వణుదుర్రులో ఓ వైకాపా నేత కుమారుడు వారం నుంచి అక్కడ మకాం పెట్టారు. నేరుగా ప్రచారం చేయకున్నా ఎన్నికల వ్యవహారం మొత్తం చూస్తున్నారు. ఓటర్లను రాత్రుళ్లు కలవటంతోపాటు తమ ప్రభుత్వ హయాంలో అందిన పథకాల గురించి గుర్తు చేస్తున్నారు. ఓటు వేయకుంటే పథకాలు తొలగిస్తామన్న విషయాన్ని అన్యోపదేశంగా చెబుతున్నారని తెలిసింది. ఈ వారంలో పదుల సంఖ్యలో తెదేపా కార్యకర్తలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసి పార్టీ మార్పించారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
ఓటుకు రూ.2వేలు.. ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు వ్యవహారం గురువారం నుంచే మొదలైంది. వీరమ్మకుంటలో ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు ఓటుకు రూ.500 చొప్పున నగదు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి మరో రూ.500 అందజేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో డ్వాక్రా మహిళలకు ఒక్కో సంఘానికి రూ.5వేల చొప్పున అందించారని సమాచారం. వణుదుర్రు ఉప ఎన్నికలను వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో అక్కడ ఓ   నేత ఆర్థిక సాయం అందించారు. ఓటుకు రూ.2 వేలు పంపిణీతోపాటు మద్యం పంపకాలు షురూ చేశారు. ఓటుకు రెండు సీసాల మద్యం గురువారం రాత్రి నుంచే పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో మద్యం తాగేవారు ఉన్నా లేకున్నా అందరికీ చేరవేస్తున్నారు. సాధారణంగా పంచాయతీల్లో ఎన్నికల్లో అనధికారికంగా ఖర్చు రూ.20 లక్షల వరకూ ఉంటే ఈ ఉప ఎన్నికల్లో  రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఉత్కంఠ రేగుతోంది.  

నేడే ఉప సంగ్రామం

 మూడు సర్పంచులు, 21 వార్డు స్థానాలకు ఎన్నికలు

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం  ఒంటి గంట వరకు పోలింగ్‌

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పంచాయతీ ఉప సంగ్రామం శనివారం జరగనుంది.  జిల్లాలో నాలుగు పంచాయతీ సర్పంచులు, 47 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఒక సర్పంచి, 24 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా.. రెండు వార్డు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మూడు సర్పంచులు, 21 వార్డు స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది.  సిబ్బంది ఎన్నికల సామగ్రితో శుక్రవారం సాయంత్రం ఆయా గ్రామాలకు తరలివెళ్లారు.  అక్కడే బస చేసి,  పోలింగ్‌ బూత్‌ను సిద్ధం చేశారు. సున్నిత, సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 2 గంట  నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని