logo

పేద కుటుంబాల్లో మద్యం చిచ్చు!

‘అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం. స్టార్‌ హోటళ్లలో మినహా ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తాం. అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని నిషేధిస్తాం’

Published : 29 Jan 2024 04:10 IST

నిషేధం ఊసే మరిచిన ప్రభుత్వం

  • తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవ పడేవాడు. పిల్లలు ఆడుకునే విషయమై మద్యం మత్తులో భార్యతో గొడవపడి చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకుని మృతి చెందారు. దీంతో పదేళ్లు కూడా నిండని ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు.

  • భీమవరం బైపాస్‌ రోడ్డులో ఇటీవల రాత్రివేళ కొందరు యువకులు మద్యం తాగి ఒకరిపై ఒకరు ఖాళీ సీసాలతో దాడి చేసుకోవడంతో గాయాలయ్యాయి. ఎంతో భవిష్యత్తును చూడాల్సిన యువతపై కేసులు నమోదయ్యాయి.

ఈనాడు డిజిటల్‌, భీమవరం, పట్టణం, న్యూస్‌టుడే: ‘అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం. స్టార్‌ హోటళ్లలో మినహా ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తాం. అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని నిషేధిస్తాం’ - సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది. తీరా అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించకపోగా విక్రయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తొలుత దుకాణాల సంఖ్యను తగ్గించి ధరలను పెంచడంతో ఖజానాకు రాబడి తగ్గింది. దీంతో ధరలను తగ్గించి విక్రయాలు పెంచుకున్నారు. మద్యం కారణంగా పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా.. మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తగ్గిన దుకాణాలు 19 మాత్రమే.. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబరులో నూతన మద్యం పాలసీని ప్రకటించింది. 2020 మార్చి తర్వాత మొదటి విడతలో 25 శాతం దుకాణాలు తగ్గించారు. 2020 అక్టోబరులో రెండోసారి, తాజాగా మూడోసారి మద్యం పాలసీని ప్రకటించినా షాపులు తగ్గలేదు. దీనికి తోడు వాకిన్‌ స్టోర్స్‌, పర్యాటక ప్రాంతాల్లో మాల్స్‌ పేరిట మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ లెక్కన మొత్తానికి తగ్గిన దుకాణాల సంఖ్య 19 మాత్రమే.

ఇదీ పరిస్థితి.. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో 210 మద్యం దుకాణాలుంటే ప్రస్తుతం 191 ఉన్నాయి. ఏటా 25 శాతం దుకాణాలను తగ్గించి నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. గత నాలుగేళ్లలో పరిస్థితులను పరిశీలిస్తే రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే వారి సంపాదనలో పెద్దగా మార్పులేదు. కానీ పేదలు మద్యానికి వెచ్చించే ఖర్చు రెండింతలైంది. నాసిరకం మందు విక్రయించడంతో ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. కష్టపడి సంపాదించిందంతా మద్యానికి, ఆసుపత్రులకే అయిపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో గతేడాది నమోదైన కేసులు

మద్యం అక్రమ రవాణా 73
అక్రమ విక్రయాల్లో అరెస్టయిన వారు 167
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ 1,890
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం 16,731

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని