logo

ఇచ్చింది కొంత.. లెక్కల్లో వింత

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎంత లబ్ధి చేకూరిందో తెలియజేస్తూ గడప గడపకు సంక్షేమం పేరిట ప్రభుత్వం జారీ చేసిన కరపత్రాలను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. తమకు అందిన లబ్ధి కన్నా ఎక్కువ చేసి చూపడంతో ప్రశ్నిస్తున్నారు.

Updated : 14 Mar 2024 06:49 IST

పరాకాష్ఠకు చేరిన వైకాపా ప్రచార యావ

నూజివీడు రూరల్‌, ముసునూరు, మండవల్లి, ముదినేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా అయిదేళ్ల పాలనలో ఎంత లబ్ధి చేకూరిందో తెలియజేస్తూ గడప గడపకు సంక్షేమం పేరిట ప్రభుత్వం జారీ చేసిన కరపత్రాలను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. తమకు అందిన లబ్ధి కన్నా ఎక్కువ చేసి చూపడంతో ప్రశ్నిస్తున్నారు. ఇచ్చేందుకు ఇళ్ల వద్దకు వచ్చిన వాలంటీర్లను నిలదీస్తున్నారు. వైకాపా  ప్రభుత్వ ప్రచార యావ పరాకాష్ఠకు చేరిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

తప్పుడు లెక్కలే.. ‘వైఎస్సార్‌ ఆసరా మూడు విడతలుగా రూ.46 వేలు ఖాతాలో జమచేసి, నాలుగుసార్లు రూ.64,753 చెల్లించినట్లు చూపారు. అంతేకాకుండా నా ఇద్దరు కుమారులకు విద్యా దీవెన కింద రూ.1,72,000 లబ్ధి చేకూరినట్లు నమోదు చేశారు. రూ.40 వేలు రెండుసార్లు మాత్రమే ఇవ్వగా మూడు సార్లు ఇచ్చినట్లు ఉంది. వసతి దీవెన కింద రూ.లక్ష ఇచ్చినట్లు చూపారు. రూ.15 వేలు మాత్రమే జమైంది ’అని ముసునూరు మండలం గుడిపాడుకు చెందిన ఉండవల్లి నాగమణి తెలిపారు.


ఒక్క రూపాయి అందలేదు కానీ..

‘ఇంటి పేరిట మాకు రూ.2.50 లక్షలు ఇచ్చినట్లు పత్రంలో చూపారు. ఇది కాకుండా జగనన్న విద్యా దీవెన రూ.63,575, వసతి దీవెన రూ.20 వేలు, కొవిడ్‌ సాయం రూ.వెయ్యి అందినట్లు చూపారు. ఇవేవి మాకు అందలేదు. సచివాలయంలో అడిగితే మీ బ్యాంకు ఖాతాలో నగదు పడుతుందంటూ చెబుతున్నారు. ఈ విషయాన్ని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో విన్నవించేందుకు వచ్చాం’ అని నూజివీడు మండలం జంగంగూడేనికి చెందిన పాటిమీదు సుబ్బారావు కుమారుడు గిరిచరణ్‌ తెలిపారు.


ఇచ్చింది రూ.48 వేలు.. చూపిస్త్తోంది రూ.2,52,330.. మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన నారగాని సీతారామయ్య కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. ఇటీవల వాలంటీర్లు వచ్చి ‘జగనన్న తోడు రూ.10 వేలు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రూ.2,003, వైఎస్సార్‌ ఆసరా రూ.45,744, కొవిడ్‌ సహాయం రూ.1,000, వైఎస్సార్‌ చేయూత రూ.75,000, వైఎస్సార్‌ పింఛను కానుక రూ.1,16,000, జగనన్న తోడు రూ.583’ ఇచ్చినట్లు కాగితాన్ని ఇచ్చి బలవంతంగా వేలిముద్రలు వేయించుకున్నారని తెలపారు. కానీ తనకు వైఎస్సార్‌ ఆసరా, డ్వాక్రా సున్నా వడ్డీ మాత్రమే వచ్చాయని తెలిపారు. రూ.48 వేలు ఇచ్చి రూ.2,52,330 ఇచ్చినట్లు(ఇది కూడా తప్పుగా ఇచ్చారు. వాటి మొత్తం 2,50,330గా ఉండాలి) గొప్పలు చెప్పుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


మూడు సార్లు ఇచ్చి నాలుగు సార్లుగా.. ముదినేపల్లి మండలం అల్లూరుకు చెందిన పంతగాని మార్తమ్మ చిన్న బడ్డీ నడుపుకొంటుండగా భర్త లారీ డ్రైవర్‌. వీరికి అయిదేళ్లలో పలు సంక్షేమ పథకాల కింద మొత్తం రూ.62,952 మేర లబ్ధి చేకూరినట్లు కరపత్రంలో ప్రచురించారు. రూ.29 డ్వాక్రా సున్నా వడ్డీ వచ్చిందని, కానీ రూ.2,548లు పడిందని, అలాగే అమ్మఒడి మూడు సార్లు మాత్రమే వచ్చినా నాలుగు సార్లని చెప్పి రూ.53,800 నగదు జమ చేసినట్లు చూపుతున్నారని తెలిపారు. ఇవ్వకుండానే కొవిడ్‌ సాయం కింద రూ.వెయ్యి నగదుగా అందించామని కర పత్రాల్లో చూపారని ఇదెక్కడి దారుణమని మార్తెమ్మ వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని