logo

ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

పొట్టకూటి కోసం పనుల నిమిత్తం వెళుతున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 27 Mar 2024 04:12 IST

మరో 19 మందికి గాయాలు

వీర్ల కృష్ణకుమారి, సుజాత (పాతచిత్రాలు)

ఆగిరిపల్లి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : పొట్టకూటి కోసం పనుల నిమిత్తం వెళుతున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆగిరిపల్లి మండలం చిన్నఆగిరిపల్లి శివారు గొల్లగూడేనికి చెందిన 22 మంది మహిళలు కూలి(పత్తితీత) పనులకు ఆటోలో కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లికి వస్తున్నారు. మార్గంమధ్యలోని వీరపనేనిగూడెం వద్ద ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్‌ బ్రేక్‌ వేశాడు. ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వీర్ల కృష్ణకుమారి(43) అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వీర్ల సుజాత(33) మృతి చెందింది. బడుగు శివనాగేంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉంది. చాకిరి నాగమణి, జువ్వనబోయిన పద్మావతి, జువ్వనబోయిన నిర్మల, గుంట్రు ధనలక్ష్మి, గుంట్రు రమణ, జువ్వనబోయిన ప్రభావతి, చెన్ను వీరమ్మ, ఢిల్లీ నవ్య సహా.. మొత్తం 19 మంది గాయపడ్డారు. చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.  కృష్ణకుమారి, సుజాతలు వరసకు అత్తాకోడళ్లు.

గొల్లగూడెంలో విషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందడంతో గొల్లగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీర్ల సుజాత భర్త వీర్ల గోపాలకృష్ణ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 7, 9 ఏళ్ల   వయసున్న ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పోషణ కోసం కూలి పనికి వెళ్లిన సుజాత  విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ చిన్నారుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి. వీర్ల కృష్ణకుమారి భర్త వీర్ల శివనాగయ్య గొర్రెలు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు చిరు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ పోషణకు ఆమె కూడా రోజూ కూలి పనికి వెళుతోంది.

పరిమితికి మించి ప్రయాణం..

ఆటోలో పరిమితికి మించి 22 మందిని ఎక్కించుకొని ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ చాగంటిపాటి శివరామకృష్ణపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నఆగిరిపల్లి పంచాయతీకి చెందిన అతడు.. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించామని ఎస్సై పైడిబాబు తెలిపారు. నిత్యం ఇదే తరహాలో కూలీలను పనులకు తరలిస్తున్నట్లుగా గ్రామస్థులు చెప్పారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని