logo

అయిదేళ్లూ గడ్డుకాలం

అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది.

Published : 19 Apr 2024 04:49 IST

పరిశ్రమల రంగం కుదేలు
ఔత్సాహికులకు మొండిచేయి

ఏలూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో మూతపడిన పరిశ్రమలు

జిల్లాలో 2014-2019 మధ్య కాలంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు 620 స్థాపించగా 2019-2024 కాలంలో 250 పరిశ్రమలే ఏర్పాటయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.


ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. ఈ సుదీర్ఘ కాలంలో ఉమ్మడి పశ్చిమలో ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదంటే నమ్మాల్సిందే. పోనీ ఉన్నవాటిని సజావుగా సాగనిచ్చారా.. అంటే అదీ లేదనే చెప్పాలి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులకూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడటంతో అయిదేళ్లలో ఏ ఒక్కటీ సాకారం కాలేదు.


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 425 భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఏలూరులో 73, భీమవరం 181, తణుకు 83, పాలకొల్లు 22, నూజివీడు 66 ఇలా కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణ యథాతథంగా ఉన్నా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు జిల్లాలో మనుగడ లేకుండాపోయింది. ఉన్న పరిశ్రమలనే మూసేలా పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని  విద్యుత్తు బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఖాయిలాపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు మరో ప్రాంతానికి వలస వెళుతున్నారు.
అందని ప్రోత్సాహం.. విద్యుత్తు, స్థలం, ముడి సరకు ఇలా ప్రతీ దాంట్లోనూ రాయితీలు అందించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు లేవు. సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. అవగాహన సదస్సులతో చేతులు దులుపుకుంటున్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి సింగిల్‌ డెస్క్‌ విధానంలో కాలయాపన లేకుండా అనుమతులు ఇవ్వాలి. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం 15 రోజుల్లో, బిల్డింగ్‌ ప్లాన్‌ 30, విద్యుత్తు కనెక్షన్‌ 7, కాలుష్య నియంత్రణ మండలి, ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ అనుమతి 30, అగ్నిమాపక శాఖ అనుమతి 15 రోజుల్లో  ఇవ్వాల్సింది. కానీ ఆచరణలో అది జరగక కార్యాలయాల చుట్టూ ఔత్సాహికులు తిరిగితిరిగి విసిగివేసారిపోతున్నారు.  
అనుమతులు రాక నిరుత్సాహం.. ఏలూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో పీవీసీ పైపుల కర్మాగారం పెడదామనుకున్న ఒక యువకుడు అనుమతులు సకాలంలో రాక ఆ ఆలోచనను విరమించుకున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి రుణం సమకూర్చుకున్నారు. సింగిల్‌ విండో ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా సకాలంలో రాక నిరుత్సాహపడ్డారు. కర్మాగారం ఏర్పాటు చేయకుండానే వెనుదిరిగారు.
సరిగా లేదంటూ తిప్పారు.. ఒక యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రూ.2 కోట్లతో ఫర్నిచర్‌ తయారీ పరిశ్రమ పెడదామని.. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు హాజరయ్యారు. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించగా.. సరిగా లేదని అధికారులు వెనక్కు పంపారు. మళ్లీ తయారు చేయించి ఇవ్వగా.. అదీ సరిగా లేదన్నారు. విసుగు చెందిన ఆ యువకుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని