logo

పండుటాకుల ఉసురు పోసుకుంటారా?

అధికార వైకాపా పింఛనుదారులతో రాజకీయ జూదం ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా సునాయాసంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నా ససేమిరా అంటూ లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.

Published : 01 May 2024 05:17 IST

పింఛనుదారుల ప్రాణాలతో చెలగాటం
రవాణా సౌకర్యాలు లేని గ్రామాలెన్నో
బ్యాంకుల దాకా వెళ్లేందుకు అవస్థలు
మన్యం, లంక గ్రామాల్లో మరిన్ని కష్టాలు
ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే, బృందం

అధికార వైకాపా పింఛనుదారులతో రాజకీయ జూదం ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా సునాయాసంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నా ససేమిరా అంటూ లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. గత నెల పింఛన్ల  పంపిణీలో జిల్లాలో ఇద్దరు పింఛనుదారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వైకాపా ప్రభుత్వ పైశాచిక నిర్ణయాలతో ఉమ్మడి జిల్లాలోని మన్యం వాసులు, లంక గ్రామాలు లబ్ధిదారులు, మారుమూల పల్లెటూరి ప్రజలు ఎండల్లో అల్లాడాల్సిందే.


  • వేలేరుపాడు మండలం మన్యంలోని మోదెల గ్రామంలో ముగ్గురు వృద్ధాప్య పింఛనుదారులున్నారు. వారి బ్యాంకు ఖాతాలు బుట్టాయగూడెంలో ఉన్నాయి. ఇక్కడికి రావాలంటే  22 కిమీ అడవిలో కాలినడకన ప్రయాణించి దొర మామిడి చేరుకుని అక్కడి నుంచి 8 కిమీ ప్రైవేటు వాహనాల్లో వెళ్లి బుట్టాయగూడెం బ్యాంకుకు చేరుకోవాలి. 70-80 ఏళ్ల వయసులో ఈ ఎండల తీవ్రతలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని రావాలంటే మృత్యువును సవాల్‌ చేసినట్టే.

  • భీమవరం మండలం ఎల్‌వీఎన్‌పురంలోని పింఛనుదారుల ఖాతాలన్నీ గొల్లవానితిప్పలో ఉంటాయి. ఇక్కడికి రావడానికి ఎలాంటి ప్రజా రవాణా వ్యవస్థ ఉండదు. సర్వీసు ఆటోలు కూడా ఈ మార్గంలో తిరగవు. 6 కిమీ ప్రైవేటు వాహనం పెట్టుకున్నా..రూ.500 వసూలు చేస్తారు. నాగిడిపాలెంలోని పింఛనుదారుల ఖాతాలు దిరుసుమర్రులో ఉన్నాయి. అక్కడికి నేరుగా వెళ్లేందుకు ఆటోలు ఉండవు. దెయ్యాలతిప్ప వరకు దాదాపు మూడు కిమీ కాలినడకన రావాల్సిందే.. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలి.

  • ఆచంట పరిధిలోని ఆయోధ్యలంక, పుచ్చలలంక, అనగర్లంక గ్రామాల ప్రజలకు కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఖాతాలుంటాయి. వారు బ్యాంకుకు వెళ్లేందుకు ఎలాంటి ప్రయాణ సౌకర్యం ఉండదు. ఎండలో దాదాపు 5 కిమీ మేర సొంత వాహనాల్లో వృద్ధులను, దివ్యాంగులను తీసుకువెళ్లటం కష్టతరమవుతుంది. ప్రైవేటు వాహనాల్లో తీసుకువెళితే రూ.500 వసూలు చేస్తున్నారు.  

మ్మడి జిల్లాలో 5.1 లక్షల సామాజిక పింఛన్లు ఉన్నాయి. బ్యాంకులు 556 ఉన్నాయి. సాధారణ సేవల కోసం ఆరోగ్యవంతులు బ్యాంకులకు వెళితేనే నిలువుకాళ్లపై నిలబడి నిరీక్షించి నీరస పడిపోతారు. పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తెలిసినా వైకాపా సర్కారు కర్కశత్వం ప్రదర్శిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40 శాతం గ్రామాలకు బ్యాంకులు చాలా దూరంగా ఉన్నాయి. మన్యం, గోదావరి, కొల్లేరు లంక గ్రామాల ప్రజలు నరకం చూడాల్సిందే. కనీస రవాణా సౌకర్యం కూడా లేదు. ప్రైవేటు వాహనాలపై వెళితే వచ్చే పింఛను సొమ్ము దానికే సరిపోతుంది. చచ్చీచెడీ వెళ్లినా ఇంత మంది ఒకేసారి బ్యాంకులకు వెళ్లినా తొక్కిసలాటలు, కొట్లాటలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇతర బ్యాంకు సేవలు నిలిపేసి పింఛన్లు ఇవ్వాలంటే సాధ్యపడదు. దీంతో బ్యాంకుల్లో గంటలు..రోజులకొద్దీ నిరీక్షణే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.


కైకలూరు మండలం శృంగవరప్పాడు, గుమ్మళ్లప్పాడు, పందిరిపల్లిగూడెం తదితర 10 లంక గ్రామాల్లో దాదాపు 2500 పింఛనుదారులున్నారు. వీరికి 20 కిమీ దూరంలో ఉన్న కైకలూరు, ఆకివీడులో బ్యాంకు ఖాతాలున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు ఆయా గ్రామాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ లేదు. కనీసం సర్వీసు ఆటోలు కూడా ఉండవు. ద్విచక్రవాహనాలే దిక్కు. 45 డిగ్రీల మండుటెండలో వృద్ధులను, దివ్యాంగులను పింఛన్‌ కోసం తీసుకువెళ్లడమంటే వారి ప్రాణాలతో కుటుంబ సభ్యులు చెలగాటమాడినట్లే. ప్రత్యేకంగా ఆటో పెట్టుకుంటే వెళ్లి, రావడానికి పింఛన్‌ తీసుకునే వరకు వేచి ఉన్నందుకు రూ.1500 సమర్పించుకోవాల్సిందే. వచ్చే రూ.3వేలలో సగం ప్రయాణానికి పోతే ఇంకేం మిగులుతుందని ఆవేదన చెందుతున్నారు.


ఏజెన్సీ పరిధిలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు  మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు బ్యాంకులు, సచివాయాలకు రావాలంటే మండుటెండల్లో మైళ్లకొద్దీ కాలి నడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


ఈయన కట్టం సుందర్రావు రాయికుంట వాసి.. ఎక్కువ దూరం నడవలేరు. అయినా ఆయన పింఛను కోసం కుక్కునూరులోని బ్యాంకుకు కొడుకు సహాయంతో వెళ్లక తప్పదు.  ఆ గ్రామంలో 52 మంది పింఛనుదారులుండగా నలుగురికి మాత్రమే ఇంటికెళ్లి పింఛను అందజేస్తారట. మిగిలిన వారు బ్యాంకుకు వెళ్లక తప్పటం లేదు.


ఇంటికి తెచ్చేలా చూడండయ్యా..
- ఈద నాగేశ్వరరావు, తలతాడితిప్ప

పదేళ్ల క్రితం పక్షవాతానికి గురయ్యా. నా భార్య సహకారం లేనిదే ఎక్కడికీ వెళ్లలేను. బ్యాంకు పుస్తకం ఎక్కడ ఉందో తెలియదు. ఏటీఎం కార్డుకూడా లేదు. అనారోగ్యంతో బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి నిలబడలేను. సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.


బ్యాంకులో వేసే సంగతే తెలియదు..
- ఎం.సంతోషమ్మ, వరిధనం

నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఈ వయస్సులో బ్యాంకుకు వెళ్లి తీసుకోవడం ఎలా. కనీసం అధికారులు ఎవరూ బ్యాంకులో జమ చేసే సమాచారం కూడా చెప్పలేదు. మూడు రోజులు ఆలస్యమైనా ఇంటికి తెచ్చి ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని