logo

దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..

దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది.

Updated : 01 May 2024 06:24 IST

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తెల మృతి
తల్లి, కుమారుడికి తీవ్రగాయాలు

రుద్ర రాము కుటుంబం

పెదపాడు, ఉంగుటూరు, న్యూస్‌టుడే: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. పెదపాడు ఎస్సై శుభశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. పెదపాడు మండలం అప్పనవీడు పంచాయతీ తాళ్లమూడి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌కు ఉన్న ఇనుపరాడ్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో వాహనం నడుపుతున్న రుద్రరాము (33), కుమార్తె రక్షశ్రీ (9) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అతడి భార్య శిరీష, కుమారుడు నాగదర్శిక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో షేక్‌ కరీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కైకరానికి చెందిన రుద్రరాము సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతితో కైకరంలో విషాదఛాయలు అలముకున్నాయి.


భవనం పైనుంచి జారిపడి కూలీ మృతి

నిట్టా వేణు

భీమడోలు, న్యూస్‌టుడే: భీమడోలులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందారు. ఎస్సై సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అంబరుపేటకు  చెందిన నిట్టా వేణు సెంట్రింగ్‌ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కింద  పడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేణుకు భార్య,  ఇద్దరు పిల్లలున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని