logo

కూటమి ప్రభుత్వంలో ‘పోలవరం జిల్లా’

పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు.

Published : 01 May 2024 05:23 IST

2027 నాటికి ప్రాజెక్టూ పూర్తి చేస్తాం
చింతలపూడి ఎత్తిపోతలనూ నిర్మిస్తాం
వారాహి విజయభేరి సభలో పవన్‌

కొయ్యలగూడెం సభలో ప్రసంగిస్తున్న పవన్‌ కల్యాణ్‌

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు.  ప్రధాని మోదీ సహకారంతో పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు కోసం తొలిసారి పెద్ద మొత్తంలో భూమి ఇచ్చిన కరాటం రాంబాబు కుటుంబ సభ్యుల స్ఫూర్తితో నిర్వాసితులకు మేలు చేయాలని, ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతోనే పోలవరం సీటును జనసేన కోరడం జరిగిందన్నారు.

రూ.కోటి చొప్పున విరాళం.. ప్రతిఒక్కరూ సెస్‌ చెల్లిస్తే ఆరు నెలల్లో నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు. అందుకు తనవంతుగా రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌ యాదవ్‌ తనవంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు.

కొయ్యలగూడెం సభలో సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌. చిత్రంలో కూటమి అభ్యర్థులు బాలరాజు, పుట్టా మహేష్‌యాదవ్‌, సొంగా రోషన్‌ తదితరులు

అడుగడుగునా పూల వర్షం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే:  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు గవరవరంలోని హెలీప్యాడ్‌ వద్ద కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడే దాదాపు 40 నిమిషాలు పాటు జనసేన నియోజకవర్గ నాయకులతో పవన్‌ మంతనాలు జరిపారు. అనంతరం కొయ్యలగూడెం సభాస్థలి వద్దకు ర్యాలీగా రాగా... దారి పొడవునా జనసైనికులు పూలవర్షం కురిపిస్తూ ముందుకు సాగారు. రాత్రి సభ అనంతరం పవన్‌కల్యాణ్‌ రోడ్డు మార్గాన నల్లజర్ల మీదుగా పిఠాపురం బయలుదేరి వెళ్లారు. సినీ నటులు హైపర్‌ ఆది, రాంప్రసాద్‌లు హెలిప్యాడ్‌ వద్ద సందడి చేశారు.

హాజరైన జనసందోహం


చింతలపూడి బాధ్యత మాదే

నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు గానీ ప్రభుత్వ భవనాలకు వైకాపా జెండా రంగులు వేయడానికి మాత్రం రూ.1300 కోట్లు ఖర్చు పెట్టారని, మళ్లీ వాటిని తొలగించడానికి ఇంకో రూ.100 కోట్లు ఖర్చుచేశారని పవన్‌ మండిపడ్డారు. ఒక సామాజిక వర్గానికి ప్రయోజనమని చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. ఆ పథకం పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం కూటమి ఆధ్వర్యంలో విడుదల చేసిన సూపర్‌ సిక్స్‌, షణ్ముఖవ్యూహం మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. పోలవరం అభ్యర్థి  చిర్రి బాలరాజు, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌ యాదవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని