logo

కదిలిన కొలువుల గుట్టు

వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు.

Published : 01 May 2024 04:49 IST

వైకాపా నేత పెత్తనం..అవుట్‌ సోర్సింగ్‌ నియామకాల విక్రయం

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు. అర్హత లేకపోయినా... పలువురికి అడ్డదారిలో ఉద్యోగాలు ఇప్పించారు. ఆశావహుల నుంచి పెద్దఎత్తున నగదు తీసుకొని ప్రభుత్వ కొలువులు కట్టబెట్టారు. ఈ విషయం లోకాయుక్త దృష్టికి వెళ్లడంతో తక్షణం స్పందించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్య ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ ఉద్యోగాలిచ్చిన సమయంలో విధులు నిర్వర్తించిన ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌, హెల్త్‌ సెక్షన్‌ పర్యవేక్షకుడు షేక్‌ సిరాజుద్దీన్‌, నగరపాలక సంస్థ పర్యవేక్షకుడు కేఎస్‌ఎన్‌ కృష్ణమూర్తి, జూనియర్‌ అసిస్టెంట్‌ తోట మాణిక్యాలరావుపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ కార్యాలయం సిద్ధమైంది. తాజాగా వారిపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

లోకాయుక్త ఆదేశాలతో బాధ్యులపై చర్యలు.. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న 17 పొరుగు సేవల ఉద్యోగాల భర్తీకి 2021లో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా... రోస్టర్‌ విధానం పాటించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. వారి నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేసి 17 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు ఫైల్‌ సిద్ధం చేసి కలెక్టర్‌తో సంతకం చేయించి ఉద్యోగాలిచ్చేశారు. అప్పట్లో అక్రమమార్గాన ఉద్యోగాలు పొందిన వారంతా ప్రస్తుతం నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఓ కార్మిక సంఘ నాయకుడైన సునీల్‌కుమార్‌ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా.. రాజమహేంద్రవరం ఆర్‌డీ కార్యాలయ అధికారులు విచారణ చేపట్టారు. అవకతవకలు జరిగాయని.. ఎక్కడా నిబంధనలు పాటించలేదని వీరి నుంచి అందిన నివేదిక మేరకు లోకయుక్త చర్యలకు ఆదేశించింది.

అన్నీతానై నడిపిన ఓ ప్రజాప్రతినిధి.. ప్రతిభ ఆధారంగా అర్హులకు రావాల్సిన 17 పోస్టులను అడ్డదారిలో అమ్మేసుకోవడం వెనుక... ఓ వైకాపా ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారు. అన్నీతానై చక్రం తిప్పడంతో అధికారులు సైతం గుట్టుగా పని కానిచ్చేశారు. సదరు ప్రజాప్రతినిధి ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.3 లక్షలు నగదు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రూ.అరకోటి వరకూ వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని