logo

నచ్చకుంటే బదిలీ.. లేదా బలి

నచ్చి, వారి అడుగులకు మడుగులొత్తే అందలమెక్కించడం...నచ్చకపోతే నరకం చూపించటం వైకాపా పాలనలో అనవాయితీగా మారింది. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించటం.. డిప్యుటేషన్‌పై దూరంగా విసిరేయటంతో గత అయిదేళ్లలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

Updated : 01 May 2024 06:24 IST

ప్రభుత్వ ఉద్యోగులపై వైకాపా నేతల పెత్తనం
పోలీసు సిబ్బందిపైనా కక్ష సాధింపు
కైకలూరు, ముదినేపల్లి, న్యూస్‌టుడే

నచ్చి, వారి అడుగులకు మడుగులొత్తే అందలమెక్కించడం...నచ్చకపోతే నరకం చూపించటం వైకాపా పాలనలో అనవాయితీగా మారింది. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించటం.. డిప్యుటేషన్‌పై దూరంగా విసిరేయటంతో గత అయిదేళ్లలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎన్నికల నియమావళి వచ్చింది.. పరిస్థితులు మారతాయని ఆశించినా భంగపాటే మిగిలింది.

వైకాపా పాలనలో కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. శాఖ ఏదైనా.. ఏ స్థాయి ఉద్యోగైనా... తమ చెప్పు చేతల్లో నడిచేలా ఓ వైకాపా నేత..ఆయన కుమారులు, అనుచరులు పెత్తనం చేస్తున్నారు. ఇదే క్రమంలో వైకాపా అధికారంలోకి రాగానే నాలుగు మండలాల నుంచి సుమారు 40 మంది రెవెన్యూ ఉద్యోగులను(వీఆర్వోలు)  తెదేపాకు అనుకూలంగా పనిచేస్తారనే నెపంతో బదిలీ చేయించారు. ఆ తర్వాత పోలీసు కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించారు.. వారికి అనుకూలంగా లేని కొందరిని బలవంతంగా బదిలీపై వెళ్లేలా ఒత్తిడి చేశారు. ఓ మండలానికి చెందిన ఎస్‌ఐను తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకోవడం కోసం బదిలీ చేయించారు. వారు చెప్పిందే వేదంగా తలాడించే మరో అధికారిని కైకలూరుకు బదిలీపై రప్పించుకుని అదనంగా మరో మండలానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

కోడ్‌ వచ్చినా కొనసాగింపు.. వైకాపా నేత నాలుగు మండలాల పరిధిలోని అయిదు పోలీసుస్టేషన్లలోని తమకు నచ్చని 17 మందిని ఒకసారి, ఎనిమిది మందిని మరోసారి డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపించేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక సాధారణంగా డిప్యుటేషన్లు రద్దై తిరిగి పాత ప్రాంతంలోకి వచ్చి ఉద్యోగులు విధులు నిర్వహించాలి. వైకాపా నేత ప్రాబల్యంతో ఇప్పటి వరకు వారు పాత ప్రాంతాలకు రాకుండా అదే ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. తమ డిప్యుటేషన్లు రద్దు చేయడం లేదని  కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటి బిగువున భరిస్తూ.. ‘అధికార పార్టీకి అనుకూలంగా లేమని, చెప్పినట్లు విధులు నిర్వహించడం లేదనే నెపంతో మమ్మల్ని కైకలూరు సర్కిల్‌ నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్‌ చేశారు. 6 నెలలు దాటినా ఇప్పటి వరకు వారికి నచ్చిన ప్రదేశంలో విధులు చేయిస్తున్నారు. దీంతో కుటుంబాలకు దూరంగా ఉండి నరకం చూస్తున్నాం. పిల్లల పరీక్షల సమయంలోనూ దగ్గర లేకుండా పోయాం. మేము ఏ తప్పు చేయకపోయినా ఇంత కక్ష ఎందుకు? ఎన్నికల కోడ్‌ వచ్చినా రాజకీయాలు ఏమిటి....కైకలూరులో కాకపోతే మరోచోట పోస్టింగ్‌ ఇస్తే కుటుంబాలను అక్కడికి మార్చుకుంటాం. ప్రభుత్వ ఉగ్యోగులమైనా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం’ అని కొందరు కానిస్టేబుళ్లు   తమ బాధను వెలిబుచ్చారు.


సిబ్బంది లేక అవస్థలు.. వైకాపాకు అనుకూలంగా లేరనే నెపంతో ఇక్కడి  స్టేషన్ల నుంచి కొందరు కానిస్టేబుళ్లను నూజివీడు, కుక్కునూరు వంటి ప్రదేశాల్లో విధుల్లో కొనసాగిస్తున్నారు. మరో స్టేషన్‌కు బదిలీ చేయకుండా 25 మందిని ఇష్టానుసారం తిప్పుతున్నారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు వీరిని ఇంకా మెమోలపై కొనసాగించడంతో వారు ఆవేదన చెందుతున్నారు.   కైకలూరు పట్టణం, గ్రామీణ స్టేషన్లలో అవసరానికి సిబ్బంది లేక ఇతర సిబ్బందిపై భారం పడుతోంది. ఎన్నికల వేళ గ్రామాల్లో శాంత్రి భద్రతల పర్యవేక్షణ కు సరిపడా కానిస్టేబుళ్లు లేరు. దీంతో కొన్ని గ్రామాల్లో రాత్రి వేళ గస్తీకి మంగళం పాడేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని