logo

వైకాపాను సాగనంపుదాం..

ఎన్డీయే కూటమి శ్రేణుల్లో  తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Published : 01 May 2024 05:26 IST

కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిద్దాం
అయిదేళ్లపాటు విశ్వసనీయతతో సేవలందిస్తాం
దెందులూరు సభలో చంద్రబాబు
కూటమి శ్రేణుల్లో జోష్‌ నింపిన ప్రజాగళం

దెందులూరు సభలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే:  ఎన్డీయే కూటమి శ్రేణుల్లో  తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు.

నియోజకవర్గ సమస్యల ప్రస్తావన.. ప్రజాగళం ప్రారంభానికి ముందుగా దెందులూరు నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడారు. ఆ నియోజకవర్గం గురించి పరిచయం చేయడంతోపాటు సమస్యలను ప్రస్తావించారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీరు సక్రమంగా అందడం లేదన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తొలగించేలా చూడాలని చంద్రబాబును కోరారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఒక పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని అన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి మహేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏలూరులో పరిశ్రమలను నెలకొల్పుతానని అన్నారు. తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలందరూ అభివృద్ధి సాధించాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని, చిత్రంలో  చంద్రబాబు, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌యాదవ్‌, పార్టీ నేతలు వంగవీటి రాధా, గన్ని వీరాంజనేయులు 

వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలు ఏవిధంగా నష్టపోయారనే అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనను అంతమొందించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెదేపా, జనసేన, భాజపాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాబోయే 12 రోజులపాటు శక్తి వంచన లేకుండా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమకు విజయం చేకూరిస్తే అయిదేళ్లపాటు ప్రజలకు విశ్వసనీయంగా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థి మహేశ్‌ కుమార్‌ ఎంతో సమర్థుడని అన్నారు. పేరొందిన పారిశ్రామికవేత్తలతో ఆయనకు సత్సంబంధాలున్నాయని, ఎôపీగా గెలిపిస్తే ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.

హాజరైన జనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని