logo

నువ్వొచ్చింది మొదలు.. చెదలు

గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు.

Updated : 19 Apr 2024 06:12 IST

బూజు పట్టిన పుస్తకాలు..మూతపడుతున్న భవనాలు
వైకాపా పాలనలో గ్రంథాలయాల దుస్థితి

పాలకొల్లు, నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే బృందం : గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఎంతో తపనతో వచ్చే పేద విద్యార్థులకు నిరాశకు గురి చేస్తున్నాయి. అసౌకర్యాలే స్వాగతం పలుకుతున్నాయి. గ్రంథాలయ, స్థానిక సంస్థలు నిర్వహణ ఎవరిదైనా ఈ వ్యవస్థ ఉభయ జిల్లాల్లో అస్తవ్యస్తంగా మారింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక వీటి వైపు కన్నెత్తి చూసింది లేదు. దీంతో నిరాదరణతో దాదాపుగా మూతపడే దుస్థితికి చేరాయి.


గ్రామ పంచాయతీలు నిధులను రాష్ట్రప్రభుత్వం ఎప్పుడైతే ఇష్టానుసారం వాడుకోవడం ప్రారంభించిందో అప్పటి నుంచే గ్రంథాలయాల పతనం ఆరంభమైంది. గ్రామపంచాయతీలకు ప్రజలు చెల్లించే పన్నుల నుంచి గ్రంథాలయాలకు శిస్తు రూపంలో రావాల్సిన వాటాకు పూర్తిగా గండిపడింది. దీంతో కనీసం పుస్తకం కొనాలన్నా సొమ్ముల్లేని దుస్థితికి గ్రంథాలయాలు చేరాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్కో మండలం నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు పైబడి గ్రంథాలయశాఖకు బకాయిలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.12 కోట్లు సెస్‌ బకాయిలుంటే దానిలో ఒక్క ఏలూరు నగరపాలక సంస్థ నుంచే రూ.7 కోట్లు రావాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తం బకాయి ఒకేచోట ఉంటే ఒక సంస్థ నిర్వహణ ఎంతకష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పట్టించుకుంటే ఇంత పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉండేది కాదు. బకాయిల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న గ్రంథాలయాధికారులకు చెల్లించాల్సింది పోయి గ్రంథాలయ భవనం పన్ను బకాయి చెల్లించాలంటూ ఎదురు ప్రశ్నించే పరిస్థితిలో నగరపాలక అధికారులున్నారు. దీంతో అసలే అస్తవ్యస్తంగా మారిన గ్రంథాలయ సంస్థ వెంటిలేటర్‌పైకి చేరింది.


అంతర్జాలానికి అంతరాయం

ప్రతి గ్రంథాలయానికి తెదేపా ప్రభుత్వ హయాంలో కంప్యూటర్లు, అంతర్జాల సౌకర్యం ఏర్పాటుచేసి విద్యార్థులకు అవసరమైతే అంతర్జాల విజ్ఞానం పెంపొందించేలా సౌకర్యం కల్పించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్‌ పుణ్యమా అని గ్రంథాలయాలను తెరిచేవారే కరువవడంతో వాటిక్కూడా అంతరాయం ఏర్పడింది. గ్రంథాలయం తెరిచే సరికే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు చదువరులు సిద్ధంగా ఉండే రోజుల నుంచి ఇది వరకు గ్రంథాలయాలుండేవనే చెప్పుకొనే రోజులకు వ్యవస్థ దిగజారింది.
నరసాపురంలో రూ.1.28 కోట్లతో, తణుకులో రూ.1.02 కోట్లతో గ్రంథాలయ భవనాల నిర్మాణాలు చేపట్టారు. నిధులిచ్చే నాథుడు లేక పునాదుల దశలోనే నిలిచిపోయాయంటే వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి  అర్థమవుతుంది.

నిధులివ్వని ప్రభుత్వం

ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 మంది లైబ్రేరియన్లు ఉన్నా ఏలూరు జిల్లా గ్రంథాలయంలోనే 15 మంది వరకు పనిచేస్తున్నారు. మిగిలిన 73 గ్రంథాలయాల్లో కలిపి 44 మంది పనిచేయాల్సి వస్తోంది. భీమవరం జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఇద్దరంటే ఇద్దరే పనిచేస్తున్నారు.


గ్రంథాలయంలో ప్రత్యేక గది సౌకర్యంతో ఉన్న కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి తెస్తే పేద విద్యార్థులకు, యువతకు ఎంతో మేలు. పోటీ పరీక్షలకు వెళ్లే మావంటి వారికి ఉపయోగకరం.

 వి.వి.వి.నరసింహమూర్తి,  భీమవరం.


పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అన్ని పుస్తకాలు ఉండేవి. 2019 నుంచి ప్రభుత్వం గ్రంథాలయ సెస్‌ను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. అప్పటి నుంచి కొనడం లేదు. అరకొర పుస్తకాలతోనే సరిపెడుతున్నారు. జిల్లా గ్రంథాలయాల పరిస్థితి దారుణంగా ఉంది.

జి.వి.రామారావు, ధర్మ అప్పారావు కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌, నూజివీడు


పుస్తకాలు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న ఈ అరలు నూజివీడు అజరయ్యపేటలోని మున్సిపల్‌ గ్రంథాలయంలోనివి. గతంలో సుమారు 50 మంది నిత్యం ఇక్కడికి వచ్చేవారు. దినపత్రికలూ రాని దుస్థితిలో ప్రస్తుతం ఎవరూ రావడం లేదు.


జంగారెడ్డిగూడెంలోని శాఖ గ్రంథాలయంలో పాత పుస్తకాలే దిక్కు. ఇక్కడి సిబ్బందిని మరో చోటకు ప్రతి గురువారం ఇన్‌ఛార్జిగా నియమించడంతో ఆ రోజు పుస్తకవిభాగం మూతపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని