logo

హామీల మోత.. కొర్రీలతో కోత!

‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీ ఇది.

Updated : 02 May 2024 05:42 IST

అక్కచెల్లెమ్మలతో జగనన్న ఆటలు

సాకులతో అమ్మఒడి సాయం దూరం

 

ఈనాడు డిజిటల్‌, భీమవరం, ఏలూరు విద్య, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీ ఇది. తీరా అధికారంలోకి వచ్చాక సాయాన్ని ఒక బిడ్డకే పరిమితం చేశారు. నిర్వహణ ఖర్చుల పేరిట రూ.2 వేలు కోత పెట్టారు. వివిధ నిబంధనలు చేరుస్తూ లబ్ధిదారుల సంఖ్యనూ కుదించారు.

నిర్వహణ నిధి పేరిట..

తల్లులకు రూ.15 వేలు ఇస్తామన్న సీఎం జగన్‌.. మొదటి ఏడాది నుంచే కోతలు ప్రారంభించారు. 2019-20లో రూ.15 వేలు జమచేసి, తర్వాత మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి ఇవ్వాలని కోరారు. ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయులు వసూలుచేసి మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎంఎఫ్‌)కి జమ చేశారు. దీనిపై కొందరు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో 2020-21లో రూ.వెయ్యి మినహాయించుకుని రూ.14వేలే జమ చేశారు. 2021-22లో కోత రూ.2 వేలకు చేరింది.

  • పశ్చిమ గోదావరి జిల్లాలో 2020-21లో లబ్ధిదారులకు రూ. 219.231 కోట్లు అందించగా, 2022-23లో రూ.215.301 కోట్లకు తగ్గింది. లబ్ధిదారుల సంఖ్య 2,620 తగ్గగా రూ.4 కోట్ల వరకు ప్రభుత్వం మిగుల్చుకుంది.
  • ఏలూరు జిల్లాలో 2020-21లో రూ.265.11 కోట్లు అందించగా, 2022-23లో ఇది రూ.259.434 కోట్లకు పరిమితమైంది. ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య 3,784 మంది తగ్గగా, రూ.6 కోట్ల వరకు ప్రభుత్వం మిగుల్చుకుంది.

నిబంధనల పేరిట మెలిక

వైకాపా ప్రభుత్వం పలు నిబంధనలను తెరపైకి తెచ్చి లబ్ధిదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. సీఎం ఆర్భాటంగా బటన్‌ నొక్కినా రెండు మూడు నెలలకు గానీ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.

  • జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి సాయాన్ని జూన్‌కు మార్చి ఏడాది లబ్ధి సుమారు రూ.470 కోట్లకు జగన్‌ సర్కారు గండి కొట్టింది.
  •  తొలి రెండేళ్లు మిగిలిన సంక్షేమ పథకాల నిబంధనలనే అమ్మఒడికి వర్తింపజేశారు. 2021-22లో 75 శాతం హాజరు,    ఆరుదశల వడపోత విధానం ప్రవేశపెట్టారు.
  •  2022-23లో 75 శాతం హాజరుతో పాటు సగటున విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్ల పరిమితిని తెరపైకి తెచ్చారు. గండి కొట్టింది.

ఎవరికి చెప్పాలో..

వివిధ కారణాలతో అర్హత కోల్పోయిన వారు సంబంధిత శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లి సచివాలయాల్లో అందజేసినా సిబ్బంది పట్టించుకొనే పరిస్థితి లేకపోయింది. అప్‌లోడ్‌ చేస్తున్న దరఖాస్తుల వరకు మాత్రమే తమకు తెలుసని.. ఫిర్యాదుల పరిష్కారానికి ఎవరికి సిఫార్సు చేయాలో తెలియదని అప్పట్లో సచివాలయ సిబ్బంది చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అర్హతల పేరిట మొండి చేయి

  • విద్యార్థి, తల్లి ఆధార్‌ పత్రంలో తప్పులున్నాయని, బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక లావాదేవీలు జరగలేదని, బియ్యం కార్డులో విద్యార్థి పేరు లేదనే కారణాలతో కొందరికి పథకాన్ని నిలిపేశారు.
  •  ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖల్లో సుమారు 16 వేల మంది పొరుగు సేవల ఉద్యోగులున్నారు. వీరి మేలు కోసం ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్సెడ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌)ను తీసుకొచ్చినట్లు గొప్పలు చెప్పిన జగన్‌.. ఈ మార్గంలోనూ కొందరికి అమ్మఒడి సాయం దూరం చేశారు. ఆప్కాస్‌ పరిధిలో ఉన్నవారి వేతనాలను సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానించడంతో పథకాలకు కోత వేశారు.
  •  మిగిలిన వారికి నెలవారీ విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు లోపు ఉండాలని షరతులు పెట్టారు. నాలుగు చక్రాల వాహనం ఉండకూదని, మాగాణి మూడెకరాలు, మెట్ట పదెకరాలకు పైగా ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి తప్పించారు. పట్టణాల్లో 750 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉన్నవారికీ మొండిచేయి చూపారు.

    ఇంటి పన్ను  ఎక్కువ వచ్చిందని

మాది మధ్యతరగతి కుటుంబం. బాబు, పాప ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి తొలి విడతలో మాత్రమే అమ్మఒడి సాయం అందింది. ఇంటి పన్ను  ఎక్కువ అనే సాకు చూపి నిలిపివేశారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
- సీహెచ్‌ చంద్రకళ, జంగారెడ్డిగూడెం


ఇద్దరికీ ఇస్తే భారం తగ్గుతుంది

మాది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు సంతానం. వారికి మంచి భవిష్యత్తు అందించేందుకు ఎంతో కష్టపడుతున్నాం. అమ్మఒడి సాయం ఒకరికి మాత్రమే వస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇద్దరి పిల్లలకూ పథకం వర్తింపజేస్తే   భారం తగ్గుతుంది.

- బొల్లం భవాని, పెదతాడేపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని