logo

ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ

ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్‌ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం.

Published : 02 May 2024 04:46 IST

 ఎండలో పింఛనుదారులకు తప్పని అగచాట్లు

 సమాచారం కోసం సచివాలయాలు, బ్యాంకులకు పరుగులు

ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్‌ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. నాలుగేళ్ల కిందట మేము ఇంటి నిర్మాణం ప్రారంభించినపుడు. ఇసుక 6 యూనిట్లు రూ.12 వేలకు లభించేది. ఇప్పుడు రూ.30 వేలకు పైబడింది. ఇసుక ధర తగ్గితే తప్ప ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునే పరిస్థితి ఎవరికీ లేదు.-కె.విజయ, ఏలూరు
ఒకటో తేదీన వచ్చే పింఛను సొమ్ము కోసం ఎదురు చూసిన ఎందరో పింఛనుదారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. తన స్వార్థ రాజకీయాలతో ఇళ్ల వద్ద పంపిణీకి ఎగనామం పెట్టి బ్యాంకుల్లో జమ చేసి లబ్ధిదారులతో ఆడుకుంటోంది. స్పష్టమైన సమాచారం లేక కొందరు సచివాలయాలకు వెళ్లి బ్యాంకులో జమైనట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లగా సెలవు అనే బోర్డులు చూసి నిరాశతో వెనుదిరిగారు. ఎన్నో ఏళ్లుగా ఖాతాలు నిర్వహించని వారు, రెండు మూడు ఖాతాలు ఉన్న వారు తమకు ఏ ఖాతాలో సొమ్ము జమైందో ..ఎలా తెలుస్తుందని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని, వేసవి వేళ సొమ్మును ఇళ్లకు తెచ్చి ఇవ్వకుండా ఇంత కష్టపెడతారా.. అంటూ కొందరు భగ్గుమంటున్నారు.

మార్టేరు, పెనుగొండ, పోడూరు, ఆచంట, పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ఆచంట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో 34,784 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉండగా వీరిలో మూడొంతులు మందికి బ్యాంకు ఖాతాలకే సొమ్ము జమైంది. వీరిలో ఎక్కువ శాతం బ్యాంకు ఖాతాలను ఏళ్ల తరబడి వినియోగించకపోవడం, ఒక్కొక్కరూ రెండు నుంచి నాలుగు ఖాతాలు కల్గి ఉండటం వంటి ఉన్నాయి. వీరికి ఏ ఖాతాలో సొమ్ము జమైందో తెలియక బ్యాంకుల చుట్టూ ప్రదక్షిలు చేయాల్సిన పరిస్థితి. ఇక వినియోగంలో లేని ఖాతా నుంచి పునరుద్ధరణ ప్రక్రియ ఖర్చు, సమయంతో కూడినది కావడంతో వృద్ధులకు అగచాట్లు తప్పేలా లేవు. దీనితోడు 1వ తేదీ నుంచి బ్యాంకులో డ్వాక్రా, ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో పింఛను సొమ్ము కోసం పడిగాపులతోపాటు సొమ్ము కొరత సమస్య సైతం

ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

మేము ఏం పాపం చేశాం...

మేము ఏం పాపం చేశాం...ఈ ఎండలో బ్యాంకుకు వెళ్లి పడిగాపులు పడి సొమ్ములు తెచ్చుకోవాలా...ఇదెక్కడి అన్యాయం..అంటూ  సచివాలయ ఉద్యోగులకు పలువురు పింఛను లబ్ధిదారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. పెనుమంట్ర మండలంలో 8439 మందికి రూ.2.4 కోట్లు రాగా 2554 మంది లబ్ధిదారులకు రూ.66.84 లక్షల సొమ్ము ఇళ్ల వద్దే పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 5885 మంది బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమైంది.


 ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్లా...

ఈ నెల పింఛను సొమ్ము బ్యాంకులో వేశారంటే ఎండలో నడుచుకుంటూ వెళ్లా. తీరా బ్యాంకుకు సెలవు. రైస్‌మిల్లు మిల్లులో కూలీగా పనిచేస్తున్నా. అద్దె ఇంట్లో ఉంటున్న నాకు ఈ పింఛను సొమ్ము  ఆధారం. దీని కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిలు చేసే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడం బాధగా ఉంది.

-  కోరాడ సీతమ్మ, పెనుగొండ


సొమ్ము ఇచ్చేందుకు ఇన్ని ఇబ్బందులా..

నా వయస్సు 66 ఏళ్లు. గత ప్రభుత్వ హయాం నుంచి పింఛన్‌ తీసుకుంటున్నా. ఏనాడూ ఇటువంటి ఇబ్బంది పడలేదు. ఇంటికి వచ్చి ఇస్తారో, బ్యాంకు ఖాతాలో జమ చేస్తారో తెలియదు. సుమారు 12 ఏళ్ల నుంచి బ్యాంకు లావాదేవీలు చేయడం లేదు. పంచాయతీకి వెళ్తే ఖాతాకు జమయ్యాయి అంటున్నారు. తీరా మేడే బ్యాంకు సెలవు. గత నెల సచివాలయ ఉద్యోగుల ద్వారా చెల్లించి ఈ నెలా మార్పు చేసి పింఛన్‌దారులను కష్టాలు పెడుతోంది.
- బి.సత్యనారాయణ, పోడూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని