logo

ఎగవేత.. లేదంటే కోత

రైతే రాజన్నది నానుడి. అయిదేళ్ల కాలంలో జగనన్న వారినీ వదల్లేదు. తన మార్కు చర్యలతో కర్షకులను అన్ని విధాలా కష్టపెట్టారు. అయితే వ్యవసాయ రాయితీల ఎగవేత.. లేదంటే కోతలతో అన్నదాతలకు నష్టాలను మూట కట్టారు.

Updated : 04 May 2024 05:00 IST

రాయితీలకు ఎగనామం
రైతులు, సామాన్యుల నడ్డి విరిచిన జగన్‌ సర్కారు
పాలకొల్లు, న్యూస్‌టుడే

రైతే రాజన్నది నానుడి. అయిదేళ్ల కాలంలో జగనన్న వారినీ వదల్లేదు. తన మార్కు చర్యలతో కర్షకులను అన్ని విధాలా కష్టపెట్టారు. అయితే వ్యవసాయ రాయితీల ఎగవేత.. లేదంటే కోతలతో అన్నదాతలకు నష్టాలను మూట కట్టారు. వీరినే కాదు..రేషన్‌ పంపిణీలో మహిళలను, వారికిచ్చే  స్త్రీనిధి రుణాల రాయితీలోనూ జగన్‌ ఝలక్‌ ఇచ్చారు.

మ్మడి జిల్లాలో 2.70 లక్షల  ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా 30 వేల వరకు విద్యుత్తు కనెక్షన్లు ఈ-ఫిష్‌ సర్వే చేసినవి ఉన్నాయి. వీటిలో 25,249 కనెక్షన్లకు విద్యుత్తు రాయితీ అందుతోంది. మిగిలిన రైతులు ఆక్వా జోన్‌ పరిధి             కాదంటూ రాయితీని ఎగ్గొట్టారు.

జోన్‌ పేరుతో చురక

ఉండికి చెందిన ఆక్వా రైతు పూసపాటి వెంకటరామరాజు ఇద్దరు రైతులకు చెందిన చెరువుల్లో కౌలుకు ఆక్వా సాగు చేస్తున్నారు. ఒక రైతు చెరువుకు విద్యుత్తు రాయితీ వస్తుండగా మరో రైతుకు చెందిన 7.60 ఎకరాలకు నాలుగేళ్లుగా రాయితీ అందడం లేదు. నెలనెలా వచ్చే రెండు విద్యుత్తు బిల్లులను పరిశీలిస్తే రాయితీ వస్తున్న చెరువుకు రూ.40 వేలు బిల్లు వస్తుంటే రాయితీ లేని బిల్లు రూ.1.20 లక్షలు వస్తోందని రైతు వాపోయారు. నాలుగేళ్లుగా రాయితీ కోసం చేయని దరఖాస్తు లేదని ఉమ్మడి జిల్లాలో తనలాంటి వారు వందలాదిగా ఉన్నారని రామరాజు ఆవేదన చెందారు.

స్త్రీనిధికి ఎగవేత

ఉమ్మడి జిల్లాలో 72,451 గ్రామ సమాఖ్యల్లో 7,36,379 మంది సభ్యులున్నారు. చిన్న తరహా ఉపాధిలో 9,250 సంఘాలున్నాయి. బ్యాంకుల నుంచి ఏటా సుమారు రూ.5 కోట్లు రుణాలు పొందుతున్నారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో బ్యాంకు లింకేజీ రుణాలే కాకుండా స్త్రీనిధి పేరిట ఒక్కొక్కరికి రూ.50 వేలు అదనపు రుణాలిచ్చేవారు. దీనికి రూపాయి వడ్డీ చొప్పున కట్టించుకున్నా పావలా వడ్డీ మినహాయించి ఆరు నెలలకోసారి వడ్డీ రాయితీ చెక్కుల రూపేణా ఇచ్చేవారు. జగనన్న వచ్చాక రాయితీ చెక్కులు పంపిణీకి ఎగనామం పెట్టారు.

యంత్రం లేని తంత్రం..

తెదేపా ప్రభుత్వంలో వ్యవసాయ యాంత్రీకరణ కింద 50 శాతం రాయితీతో 3 నుంచి 5 వేల మంది రైతులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లు విలువచేసే ట్రాక్టర్లు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు, నీళ్లు తోడుకునే ఇంజిన్లు ఏటా అన్నదాతలకు అందించేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక వ్యక్తిగత రాయితీలు ఎత్తేసింది. ఇటీవల రాయితీపై కిసాన్‌ డ్రోన్లు అందిస్తామంటూ జిల్లాలో 35 మందిని ఎంపిక చేసి కొందరు రైతులను గుంటూరు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చి సరిపెట్టారు. చివరకు రూ.4 లక్షలు రాయితీ ఇస్తాం.. డ్రోన్‌ రూ.10 లక్షలు ఉంటుందనడంతో రైతులు ఆసక్తి చూపలేదు. ఇదే వ్యవసాయశాఖ నుంచి గతంలో ఏటా 50 శాతం రాయితీపై అన్నదాతలకు ముడి జింకు సరఫరా అయ్యేది. గడిచిన నాలుగేళ్లుగా రాయితీతోపాటు జింకు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుత రబీలో వరి పంట జింకు లోపం బారిన పడి రైతులు నష్టపోతున్నారు.

కిస్తీల భారం

భీమడోలుకు చెందిన ప్రకాశ్‌ 2021లో బ్యాంకు నుంచి రూ.25 లక్షల రుణం తీసుకుని జేసీబీ కొనుగోలు చేశారు. దీనికి జగనన్న బడుగు వికాసం పథకంలో 35 శాతం రాయితీ కోసం దరఖాస్తు చేశారు. పారిశ్రామిక సంస్థ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి రాయితీకి సంబంధించిన పత్రాలను లబ్ధిదారుకు అందజేశారు. మూడేళ్లు గడుస్తున్నా నేటికీ రాయితీ రూపంలో రూపాయి విడుదల కాలేదని నెలవారీ కిస్తీలు కట్టడానికి అవస్థలు పడుతున్నామని ప్రకాశ్‌ వాపోతున్నారు.

విత్తు లేదు

ఉద్యానశాఖలో గతంలో రూ.20కే రైతులకు రాయితీపై 10 రకాల విత్తనాలు అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక విత్తు లేదు, దానిపై వచ్చే సొత్తూ లేదన్న చందాన పరిస్థితి తయారైందని పెనుగొండ మండలం ములపర్రుకు చెందిన రైతు సత్యనారాయణ వాపోయారు. లక్షలాది మంది రైతులు పెరటితోటలు వేసుకోవడానికి విత్తనాలు రాక నష్టపోయారు.

పాడిరైతుకు సాయం సున్నా

ఉమ్మడి జిల్లాలో సుమారు 60 వేల మంది పాడి రైతులున్నారు. అయిదేళ్లుగా వీరంతా గేదెలు కొనుగోళ్లలో రాయితీ కోల్పోయారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 2019 వరకు పశుసంవర్ధకశాఖ నుంచి 50శాతం రాయితీపై గేదెలు పంపిణీ చేసేవారు. ఒక్కో రైతు రూ.80 వేలు నుంచి రూ.లక్ష విలువ చేసే గేదెలను రాయితీపై తీసుకుని మేపుతూ పాల నుంచి ఆదాయం పొందేవారు. వైకాపా వచ్చాక గేదెల రుణాలు ఇస్తున్నా.. రూపాయి.. రాయితీ ఇవ్వలేదు. దీంతో సుమారు రూ.3 కోట్లకు పైగా రైతులు నష్టపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని