logo

ప్రశ్నించే గొంతుకలపై దౌర్జన్యకాండ

ప్రతిపక్షాలకు నోరెత్తే స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా గత అయిదేళ్లు అక్రమ కేసుల పరంపరను కొనసాగించింది. ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తే సాధారణ ప్రజలు కుక్కిన పేనుల్లా పడుంటారులే అన్న నియంతృత్వ పోకడలు జగన్‌ జమానాలో అడుగడుగునా కనిపించాయి

Published : 08 May 2024 05:57 IST

అన్యాయంపై నోరెత్తితే సహించని జగన్‌ సర్కారు

నిరసన తెలిపితే ప్రజాప్రతినిధుల కన్నెర్ర

 ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు

 

ప్రతిపక్షాలకు నోరెత్తే స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా గత అయిదేళ్లు అక్రమ కేసుల పరంపరను కొనసాగించింది. ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తే సాధారణ ప్రజలు కుక్కిన పేనుల్లా పడుంటారులే అన్న నియంతృత్వ పోకడలు జగన్‌ జమానాలో అడుగడుగునా కనిపించాయి. ప్రతిపక్ష నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా పైచేయి సాధించాలన్న కుతంత్రం రాజ్యమేలింది.  వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడినా తెదేపా నాయకులపైనే కేసులు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలపై కేసులు నమోదు చేయాల్సి వచ్చినా నామమాత్రపు కేసులతో మమ అనిపించారు.
జగన్‌ పాలనలో.. సమస్యలపై వినతిపత్రం ఇస్తే అపచారం..ఇబ్బందులపై గళమెత్తితే మహాపాపం..అన్యాయంపై ప్రశ్నిస్తే దారుణం.ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపితే క్షమించరాని నేరం ఇది వైకాపా మూలసూత్రం. దీన్ని అతిక్రమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పుతారు తప్పుడు కేసులు బనాయించి న్యాయం అడిగిన గొంతుకలపై ఉక్కుపాదం మోపుతారు. అక్కడితో అయిపోదు వైకాపా మూకలు విరుచుకుపడి దాడులకు తెగబడతాయి.
ఇలా గత అయిదేళ్లుగా ఉమ్మడి పశ్చిమలో వైకాపా ఆడిన రాక్షస క్రీడకు తార్కాణాలెన్నో ఉన్నాయి.

  • 2023లో బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు తెదేపా నాయకులు భీమవరం కలెక్టరేట్‌కు వెళ్లారు. వారిని  పోలీసులు అడ్డుకోవటంతో ముందుకువెళ్లే ప్రయత్నం చేసిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావుతో పాటు 25 మందిని స్టేషన్‌కు తరలించి కేసులు పెట్టారు. అన్న క్యాంటీన్‌ తెరవాలని భీమవరంలో నిరసన వ్యక్తం చేసినందుకు, ఎస్సీ కార్పొరేషన్‌ పునరుద్ధరించాలని ధర్నా చేసినందుకు 40 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు బనాయించారు.
  • నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రెండేళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 5 రోజులు  దీక్ష చేశారు. వైకాపా నిర్ణయాన్ని ప్రశ్నించడం ఏమిటన్న అధికార దర్పంతో ఆయనపై వివిధ సెక్షన్లపై ఆరు కేసులు బనాయించారు. వైకాపా నాయకులు   డ్రెయినేజీల వంకతో తెదేపా కార్యకర్తల దుకాణాల ముందు అరుగులను తరచూ ధ్వంసం చేస్తున్నారని ఆయన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తూ..అత్యంత ఆటవికంగా ఆయన చొక్కా, ప్యాంటు చింపేసి లాక్కెళ్లారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసు పెట్టారు.
  • ఈ ఏడాది జనవరి 30న పెదపాడులో వైకాపా నాయకులు చేస్తున్న మట్టి దందాను తెదేపా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పెద్దఎత్తున వచ్చిన వైకాపా కార్యకర్తలు వారిని విచక్షణారహితంగా కొట్టారు. అధికార దర్పంతో స్థానిక వైకాపా నాయకుడి ఆదేశాలతో పోలీసులు తెదేపా మండల అధ్యక్షుడు లావేటి శ్రీనివాస్‌తోపాటు మరో ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని పెదపాడు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న 12 మంది తెదేపా నాయకులపై కూడా అక్రమ కేసులు నమోదు చేశారు.
  • తెదేపా 90 శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను మిగిలిన పదిశాతం పూర్తి చేసి పేదలకు అందించాలని 2022లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌తో పాటు తెదేపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.   పోలీసులు అడ్డగోలుగా వారిని  స్టేషన్‌కు తీసుకువెళ్లడమే కాకుండా వారిద్దరితో పాటు మరో 30 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ ప్రకారం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగరరామ్మోహన్‌ దారుణంగా వేదిక పైనుంచి నెట్టేశారు.
  • గతేడాది నిర్వహించిన యువగళం యాత్రకు భీమవరంలో అపూర్వ స్పందన వచ్చింది. దీంతో వైకాపా మూకలు తట్టుకోలేక రాళ్లు, సీసాలు, కర్రలతో దాడికి తెగబడ్డారు. యువగళం వాలంటీర్లను, తెదేపా కార్యకర్తలను, చివరికి పోలీసులను విచక్షణా రహితంగా కొట్టారు. పోలీసులు మాత్రం వైకాపా కార్యకర్తలపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. వివాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో లేని తెదేపా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, చింతమనేనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరో 24 మంది నేతలపై కూడా ఇదే కేసు పెట్టారు.
  • దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఈ ప్రభుత్వం 47 కేసులు బనాయించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నిమ్మల రామానాయుడిపై 25 కేసులు నమోదు చేశారు.. కొవిడ్‌లో నిరుపేదలకు నిత్యవసరాలు, ఆహారం పంపిణీ చేసినందుకు తాడేపల్లిగూడెం తెదేపా ఇన్‌ఛార్జి వలవల బాబ్జీపై కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలకు పేరొస్తుందన్న దురుద్దేశంతో స్థానిక వైకాపా నాయకుడు ఈ అక్రమ కేసు పెట్టించారు.
  • పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి దగ్గరుండి గ్రావెల్‌ తవ్వకాలు చేయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని, తెదేపా కార్యకర్తలు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చి చింతమనేని వెళ్లిపోగా..అదే సమయంలో పెద్ద ఎత్తున వైకాపా మూకలు చేరుకుని తెదేపా నాయకుడు తాతా సత్యనారాయణ కారు అద్దాలు ధ్వంసం చేశారు. వారిపై దాడి చేసి గాయపరిచారు. పోలీసులు మాత్రం తెదేపా కార్యకర్తలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు