logo

గుక్కెడు నీటికీ యాతనే!

ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి.

Published : 10 May 2024 04:05 IST

పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్యను పట్టించుకోని జగన్‌ సర్కారు
ట్యాంకర్లపై ఆధారపడుతున్న శివారు ప్రాంత ప్రజలు

ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘ ప్రజలను తాగునీటి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. వేసవిలో సమస్య మరింత జటిలంగా తయారైంది. శివారు ప్రాంత ప్రజలు గుక్కెడు నీటికి గుటకలు మింగుతున్నారు. కుళాయిల్లో నీరెప్పుడొస్తుందో తెలియక... ట్యాంకర్ల వస్తాయో రావో సమాచారం లేక మదన పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు నీటిని కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం... పైపులైన్ల నిర్వహణను విస్మరించడం... లీకేజీలను అరికట్టడంలో ఉదాసీనత ప్రదర్శించడం కారణంగానే తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోందని పలువురు పురవాసులు ఆరోపిస్తున్నారు.


ఏలూరు... జలాలందని శివారు!

జిల్లా కేంద్రమైన ఏలూరు నగర శివారు ప్రాంత ప్రజలకు సక్రమంగా నీరందడం లేదు. శివారులోని సుమారు 13 ప్రాంతాల్లో 30 వేల మంది జీవిస్తున్నారు. వారికి కుళాయిలు ద్వారా నీరందక అల్లాడుతున్నారు. ఫలితంగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల నీరందించాల్సి ఉండగా... కేవలం 80 లీటర్లతోనే సరిపెడుతున్నారు. నగరంలోని కుమ్మరిరేవు, అల్లూరి సీతారామరాజు కాలనీ, ఆదివారపుపేట ఏటిగట్టు, పుష్పలీలానగర్‌, కొత్తపేట ఏటిగట్టు, తంగెళ్లమూడి ఏటిగట్టు, గొల్లాయిగూడెం, పాములదిబ్బ, ఆదివారపుపేట ఏటిగట్టు, లక్ష్మమ్మ చెరువు, జలాపహారేశ్వరి కాలనీ, సుంకరివారితోట ప్రాంతాల ప్రజలు తాగునీటికి ఇబ్బంది బాధపడుతున్నారు.

న్యూస్‌టుడే, ఏలూరు టూటౌన్‌


చింతలపూడి... సమస్యల ఒడి

చింతలపూడిలో తాగునీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. నగర పంచాయతీలో 32 వేల మంది జనాభా నివస్తున్నారు. ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా- కేవలం 87 లీటర్లు అందజేసి చేతులు దులుపుకొంటున్నారు. ఆంతోనీనగర్‌, పాతచింతలపూడి, సమ్మెటవారిగూడెం, భట్టువారిగూడెం తదితర ప్రాంత ప్రజలు తాగునీటికి కొట్టుమిట్టాడుతున్నారు. ఆంతోనీనగర్‌లో వంద కుటుంబాలు జీవిస్తుండగా... వారంతా రోజూ ఉదయం ఆరు గంటలకే కుళాయిల వద్దకు పరుగులు తీస్తున్నారు. వైఎస్సార్‌ కాలనీలోనూ పనులు మానుకొని... నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 

న్యూస్‌టుడే, చింతలపూడి


జంగారెడ్డిగూడెం గొంతెండుతోంది

మెట్ట ప్రాంతం జంగారెడ్డిగూడెంలో తాగునీరు కరవైంది. పట్టణంలో సుమారు 70 వేల మంది నివాసం ఉండగా- మూడొంతుల మందికి శుద్ధి జలం అందడం లేదు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దనున్న బోరు నుంచి రోజు సుమారు రెండు వేల మంది నీటిని పట్టుకెళ్తున్నారు. పురపాలక సంఘానికి గతంలో దాతలిచ్చిన రెండు ట్యాంకర్లు మరమ్మతులకు చేరడంతో... శివారు ప్రాంతాలకు జలాలు సరఫరా చేయలేకపోతున్నారు. ఎర్రకాలువ నుంచి జంగారెడ్డిగూడేనికి శుద్ధిజలాలు సరఫరా చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం అటకెక్కించడంతో సమస్య నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం


నూజివీడు ఇక్కట్లు చూడు

మండు వేసవిలో నూజివీడు పుర ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. పట్టణంలో సుమారు 58,700 జనాభా నివసిస్తుండగా... రోజుకు 80 లక్షల లీటర్లు జలాలు అవసరం. ప్రస్తుతం 45 లక్షల లీటర్ల కృష్ణా జలాలను మాత్రం రోజుమార్చి రోజు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. నీరందని ప్రాంతాలకు అయిదు ట్యాంకర్లతో రోజూ 50 ట్రిప్పులు తిప్పుతూ... 1.50 లక్షల నీరు పంపిణీ చేస్తున్నారు. ఇక శివారు ప్రాంత పరిస్థితి దుర్భరంగా ఉంటోంది. తాగునీరు ఎప్పుడొస్తుందో తెలియక... రోజంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

న్యూస్‌టుడే, నూజివీడు పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు