logo

వనితల సహకారం.. హలధారికి ఊతం

అంకిత భావం, సేవాగుణం, పట్టుదల ఉండాలే గాని ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారీ మహిళలు. ఉద్యాన, వ్యవసాయ విద్యలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలు పూర్తి చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు.

Published : 23 May 2024 03:17 IST

వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో శాస్త్రవేత్తలు, ఆచార్యులుగా రాణింపు 
అన్నదాతలకు మెలకువలు నేర్పుతూ వారి అభివృద్ధికి కృషి

వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థినులకు మెలకువలు నేర్పిస్తున్న ఆచార్యులు 

న్యూస్‌టుడే, రైల్వేకోడూరు గ్రామీణ: అంకిత భావం, సేవాగుణం, పట్టుదల ఉండాలే గాని ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారీ మహిళలు. ఉద్యాన, వ్యవసాయ విద్యలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలు పూర్తి చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలుగా పరిశోధనలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తూ చేయూతనందిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల్లోనూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. వారి మనోగతంపై ప్రత్యేక కథనం.

చేస్తున్న కార్యక్రమాలివి...

  • శాస్త్రవేత్తలుగా సమగ్ర యాజమాన్య పద్ధతులు, మెలకువలతో పాటు సేంద్రియ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
  • ఉద్యాన కళాశాలలో రావెప్‌ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను రైతులతో మమేకం చేసి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయిస్తున్నారు.
  • శాస్త్రవేత్తలుగా ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ సాగులో కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు.
  • సాగులో రసాయన ఎరువుల వినియోగంపై మార్పు తీసుకొస్తూ సేంద్రీయ సాగుపై మక్కువ కలిగేలా అవగాహన కల్పిస్తున్నారు.
  • గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి రైతులకు సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులను వివరిస్తూ అండగా నిలుస్తున్నారు.
  • ఎప్పటికప్పుడు దత్తత గ్రామాల్లో పర్యటిస్తూ నూతన వంగడాలు, అంతర పంటల ఉపయోగాలను వివరిస్తున్నారు.

శాస్త్రవేత్తగా రాణించాలన్నదే లక్ష్యం

విద్యార్థి దశ నుంచే వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణించాలన్న లక్ష్యం ఏర్పరుచుకున్నా. అదే గురితో 2012లో ఏజీ బీఎస్సీ పూర్తి చేశా. అనంతరం పీజీ పూర్తి చేసి పీహెచ్‌డీ చేస్తుండగా ఉద్యాన విశ్వవిద్యాలయ కేవీకేలో 2016లో విస్తరణ శాస్త్రవేత్తగా కొలువు సాధించా. ఉద్యాన రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ వారికి సహకారం అందిస్తున్నా. యూజీ, పీజీలో బంగారు పతకం సాధించా.

డాక్టరు శ్రీవిద్య రాణి, కృషి విజ్ఞాన కేంద్రం, వనిపెంట

పరిశోధనలపై ఆసక్తితో...

నాకు పరిశోధనలంటే ఎక్కువ ఆసక్తి. రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో వ్యవసాయంలో బీఎస్సీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశా. 2008లో ఎస్బీఐ బ్యాంకులో కొలువు సాధించా. ఉద్యాన పంటలపై మక్కువతో రాజీనామా చేసి 2009లో ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం ఉద్యాన కళాశాలలో సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్నా. 2017లో యంగ్‌ సైంటిస్ట్, యంగ్‌ అచీవర్, 2020లో బెస్ట్‌ డాక్టోరియల్‌ తీసీస్, 2021లొ యంగ్‌ ఆగ్రోనామిస్ట్, 2023లో ఎక్సలెన్స్‌ టీచింగ్‌ అవార్డు సాధించా.

డాక్టరు లలిత, సహాయ ఆచార్యులు,అనంతరాజుపేట ఉద్యాన కళాశాల, రైల్వేకోడూరు

50 రకాల ఔషధ మొక్కలపై పరిశోధనలు 

వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉంటాయో దగ్గరి నుంచి చూశా. ఎలాగైనా రైతుకు సేవలందించాలని సంకల్పించుకున్నా. యూజీ, పీజీ, ఎమ్మెస్సీ పూర్తి చేశా. విద్యార్థులకు పదిహేనేళ్ల పాటు బోధన అందించా. సాగుకు సంబంధించి అయిదేళ్ల పాటు పరిశోధనలు చేసే అవకాశం దక్కింది. విద్యార్థులకు వృత్తిపరమైన అనేక అంశాలపై పరిశోధనాత్మక ప్రయోగాలు చేసి వారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడ్డాను. 50 రకాల ఔషధ మొక్కలపై పరిశోధన చేశా.

డాక్టరు తనూజ శివరామ్, ఆచార్యులు, పులివెందుల ఉద్యాన కళాశాల

రైతుల అభివృద్ధికి తోడ్పాటు

మా నాన్న సైన్యంలో పని చేస్తూ ప్రోత్సహించడంతో మొదటిగా 2009లో శాస్త్రవేత్తగా కొలువు సాధించా. తిరుపతిలో చీనీ, నిమ్మ పరిశోధన స్థానంలో ఎనిమిదేళ్లు పరిశోధనలు చేసి ఫలితాలను సాధించా. బోధనలో ఏడేళ్ల నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నా. పండు ఈగ నివారణ పద్ధతులపై విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో అరటి, బొప్పాయి పంటలపై అధ్యయనం చేసి రైతుల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నా.

డాక్టరు శారద, సహ ఆచార్యులు, అనంతరాజుపేట ఉద్యాన కళాశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని