logo

నిధుల్లేక చతికిల‘బడి’!

ప్రభుత్వ పాఠశాలలను సమూల రూపురేఖలు మార్చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మనబడి...నాడు-నేడు పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

Published : 23 May 2024 03:25 IST

ఇదీ జిల్లాలో మనబడి... నాడు-నేడు పనుల తీరు 

 

చింతరాజుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో నిలిచిన అదనపు తరగతి గదుల పనులు 

ప్రభుత్వ పాఠశాలలను సమూల రూపురేఖలు మార్చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మనబడి...నాడు-నేడు పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వచ్చే నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అసౌకర్యాల మధ్యే విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి దుస్థితి నెలకొంది. 

సీతాపురంలో తలుపులు, కిటీకీలు అమర్చకుండా వదిలేశారు 

న్యూస్‌టుడే, కడప: వైకాపా ప్రభుత్వం మనబడి..నాడు-నేడు రెండో దశ పనులకు 2021, ఆగస్టు 16న శ్రీకారం చుట్టింది. జిల్లాలో 996 సర్కారు పాఠశాలల్లో పనులు చేయాలని ప్రతిపాదించగా, వీటిల్లో 910 బడుల్లో చేయాలని అనుమతిచ్చారు. మొత్తం పనుల విలువ రూ.295.25 కోట్లు కాగా, ఇప్పటికే దశల వారీగా రూ.160.70 కోట్లు విడుదల చేశారు. వాస్తవంగా 2022, జులై లోపు పనులు పూర్తి చేస్తామని పాలకులు గొప్పగా ప్రకటించారు. నిర్దేశిత గడువు దాటి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. 

సమన్వయలోపమే శాపం

సమగ్ర శిక్ష అభియాన్, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, పురపాలక ప్రజారోగ్యశాఖ, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల సాంకేతిక నిపుణులకు నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల ద్వారా పనులు చేయిస్తున్నట్లు చెబుతున్నా ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నాయకులకు పనుల పందేరం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణలేమితో పనుల్లో జోరు కనిపించలేదు. మొదటి నుంచి రివాల్వింగ్‌ నిధుల విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. 

బిల్లుల గోడు వినేదెవరు?

చిన్న, పెద్ద మరమ్మతులు, రక్షిత తాగునీరు, విద్యుత్తు సరఫరా, రంగులు, ఫర్నిచర్, ఆకుపచ్చ బల్ల, వంట గది, ఆంగ్ల ప్రయోగశాల, మరుగుదొడ్లు, రక్షణ గోడ, అదనపు తరగతి గదులతోపాటు మరికొన్ని పనులు చేపట్టాలని అనుమతిచ్చారు. కొన్ని బడులకు సిమెంటు ఇచ్చినా గడ్డలు కట్టింది. ఇసుక సమస్యతో పనులు ముందుకు కదల్లేదు. అదిగో నిధులొస్తాయి.. ఇదిగో బిల్లులు ఇచ్చేస్తాం అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. తొలి విడతలో కరోనా వెంటాడినా కాస్త ఆలస్యంగానైనా పూర్తి చేశారు. రెండో దశలో పనులు సాగుతూనే ఉన్నాయి. గుత్తేదారుల బిల్లుల గోడును ఆలకించేవారు కరవయ్యారు. మూడు, నాలుగు నెలలు ఎదురుచూసిన తర్వాత విడుదల చేస్తూ వచ్చారు. ఈ ప్రభావం పనుల పురోగతిపై పడింది. 

ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే

  • ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లె ప్రాథమిక పాఠశాలలో ఇంకా చలువరాయి పరచలేదు. రంగులు వేయలేదు. టీవీ, గ్రీన్‌ చాక్‌బోర్డు సరఫరా చేయలేదు. ఆర్వో కేంద్రం సామగ్రి వచ్చినా అమర్చలేదు.
  • సీతాపురంలో తలుపులు, కిటీకీలు ఏర్పాటు చేయలేదు. మరుగుదొడ్ల పనులు నిలిచిపోయాయి.
  • చింతరాజుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు చేపట్టాలని అనుమతిచ్చినా పునాది వరకు చేసి నిధుల్లేవని నిలిపేశారు. ఇక్కడ విద్యార్థులకు చెట్ల కింద తరగతి గదులు నిర్వహిస్తుండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవులు అనంతరం వచ్చే నెల 12న బడి గంట Ëమోగనుంది. ఈలోపు మిగతా పనులను పూర్తి చేయించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మూడేళ్లుగా నిధుల విడుదలతో జాప్యం చేసి ఇప్పుడు తొందరగా చేయాలని హడావుడి చేయడమేంటని హెచ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. 

శరవేగంగా పూర్తి చేయిస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మనబడి...నాడు-నేడు పనులను శరవేగంగా పూర్తి చేయిస్తాం. ఇప్పటికే చాలాచోట్ల ముగింపు దశలో ఉన్నాయి. ఎక్కడైతే పనులు నిదానంగా జరుగుతున్నాయో సమాచారాన్ని సేకరిస్తున్నాం. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ లోగా పనులన్నింటినీ పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం. 

రాఘవరెడ్డి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు