logo

గురుకులం నుంచి 29 మంది విద్యార్థుల పరారు

బి.కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీయట్‌ రెండో సంవత్సరం చదువుతున్న 29 మంది విద్యార్థులు గురువారం పరారుకావడం కలకలం రేపింది.

Published : 03 Feb 2023 00:50 IST

గంటల వ్యవధిలోనే గుర్తింపు
కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఆర్డీవో, డీఎస్పీ

విద్యార్థులతో మాట్లాడుతున్న మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప, అధికారులు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీయట్‌ రెండో సంవత్సరం చదువుతున్న 29 మంది విద్యార్థులు గురువారం పరారుకావడం కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండు గంటలకు విద్యాలయం ప్రహరీ దూకి వెళ్లిపోగా సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో ఆచూకీ దొరడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయాధికారిని కోరినట్లు మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప ప్రకటించారు. జూనియర్‌ విద్యార్థులను కొందరు రెచ్చగొట్టి సీనియర్లుగా ఉన్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇద్దరు అధ్యాపకుల కారణంగా వేధింపులకు గురవుతున్నామని విద్యార్థులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులతో పాటు అధికార యంత్రాంగం పరుగులు తీయాల్సి వచ్చింది. విద్యార్థుల ఆచూకీ కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప హుటాహుటిన బి.కొత్తకోటకు చేరుకున్నారు. ఈలోగా కొందరు విద్యార్థులు బెంగళూరు రోడ్డులో ఉన్నట్లుగా సమాచారం రావడంతో వారిని పోలీసులు పట్టుకుని గురుకులానికి తరలించారు. ప్రత్యేక గదిలో విద్యార్థులతో అధికారులు రెండు గంటల పాటు మాట్లాడారు. అనంతరం అధికారులు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి చదువుపై శ్రద్ధ చూపాలని సూచించారు. గురువారం రాత్రి విలేకరులతో ఆర్డీవో మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలో సమస్యలను పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విద్యార్థులు ఆవేశానికి గురికావద్దని, పరీక్షలు దగ్గర పడుతున్నందువల్ల బాగా చదువుకోవాలని హితవు పలికారు. మదనపల్లె రూరల్‌ సీఐ శివాంజనేయులు, ఎస్‌.ఐ. రామమోహన్‌, డీటీ హరికుమార్‌, ఎంఈవో రెడ్డిశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని