logo

కడపలో సిటీ బస్సులు తిప్పలేరా?

వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప నగరానికి జిల్లాతోపాటు పక్క జిల్లా అన్నమయ్య నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సుల్లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది.

Published : 22 Jul 2023 04:13 IST

ఆటో ఛార్జీలు  భరించలేక  సామాన్యుల పాట్లు
న్యూస్‌టుడే, చిన్నచౌకు(కడప)

వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప నగరానికి జిల్లాతోపాటు పక్క జిల్లా అన్నమయ్య నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సుల్లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. సీఎం జగన్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి జిల్లాకు చెందినవారైనా సిటీ బస్సు సర్వీసులు లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రెండు జిల్లాల నుంచి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పెద్దసంఖ్యలో రోగులు, సహాయకులు తరలివస్తుంటారు. ఆసుపత్రికి ప్రస్తుతం కడప నగరం నుంచి ఒక బస్సు తిరుగుతోంది. ఆసుపత్రి మార్గంలో శిల్పారామం, క్రీడాపాఠశాల, దంత వైద్యశాల, ఇందిరా నగర్‌, సింగపూర్‌ టౌన్‌షిప్‌, రామకృష్ణమఠం, హైదరాబాద్‌ పబ్లిక్‌ పాఠశాల, నగరవనం తదితర ప్రాంతాలున్నాయి. ఇక వారాంతపు సెలవుల్లో శిల్పారామం, నగరవనానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైగా విమానాశ్రయం కూడా ఉంది. ఒక కుటుంబం ఆటోలో వెళ్లాలంటే రూ.వందల్లో ఖర్చవుతోంది. ఆయా మార్గాల్లో సిటీ బస్సులు తిప్పితే అటు ప్రజలకు, ఇటు ఆర్టీసీకి ప్రయోజనం ఉంటుంది. అధికారులు మాత్రం ఒకటి, రెండు రోజులు నడిపి ఆదరణ లేదని ఆపేస్తున్నారు. ‘మా కుటుంబసభ్యులు నలుగురం నగరవనానికి వెళ్లి రావడానికి ఆటోకు రూ.300 వరకు ఖర్చవుతోంది. అదే సిటీ బస్సులో ఒక్కొక్కరికి రూ.20 చొప్పున రానుపోను రూ.160 సరిపోతుంది. కడప నగరం నుంచి కడప సర్వజన ఆసుపత్రికి ఒకే బస్సు ఉంది. అదీ ఎప్పుడు వస్తుందో తెలియదు.’ అని నగరానికి చెందిన ఒప్పంద ఉద్యోగి ప్రవీణ్‌ కుమార్‌ వాపోయారు. ఈ విషయమై ఆర్టీసీ డీఎం ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతానికి కడప నగరం నుంచి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఒక బస్సు నడుస్తోందని, ఆదాయం పెరిగితే మరికొన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సిటీ బస్సుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని