logo

డబ్బులివ్వందే బిడ్డనూ చూడనివ్వరు!

‘కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే వారంతా పేదలే. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఆసుపత్రికి రావడానికే ఇబ్బందులు పడుతుంటాం.

Published : 02 Aug 2023 04:19 IST

పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న సిబ్బంది
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వసూళ్లు

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కాన్పుల విభాగం

న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి : ‘కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే వారంతా పేదలే. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఆసుపత్రికి రావడానికే ఇబ్బందులు పడుతుంటాం. ఆసుపత్రిలో కూర్చుంటే, దుస్తులు మారిస్తే, వార్డు మారిస్తే, ప్రసవమైతే ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేవని మొత్తుకున్నా వినడంలేదు. ఇవ్వకుంటే బూతులు తిడుతున్నారు. వైద్యులు, నర్సులు బాగానే చూస్తున్నా కొంతమంది సిబ్బంది తీరు చాలా బాధాకరంగా ఉంది.’  ఇదీ ఓ బాలింత తల్లి రామలక్షుమ్మ ఆవేదన.

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొందరు సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారని బాలింతలు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవాల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వైద్యులు వారికి సేవలందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాన్పుల విభాగంలోని కొంతమంది సిబ్బంది ప్రసవమైన వారి (బాలింత) బంధువులను పిలిచి డబ్బులివ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మగబిడ్డ పుడితే ఓ రేటు, ఆడబిడ్డకో రేటు చెప్పి, ఇవ్వకుంటే దుర్భాషలాడుతున్నారు. తమతో పాటు వైద్యులకు, నర్సులకు, ఓటీలో పని చేసే వారికి కూడా తామే డబ్బులివ్వాలని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే రూ.వేలు ఖర్చవుతాయని, ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, మాకు రూ.వెయ్యి, రూ.రెండు వేలు ఇవ్వలేరా అని దబాయిస్తున్నారు. పేదలను డబ్బుల కోసం పీడించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని గర్భిణలు, బాలింతలు వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.


తర్వాత ఇస్తామన్నా వినడం లేదు

కాన్పు అనంతరం పారిశుద్ధ్య విభాగం, ఓటీ సహాయకులు (ఓటీ అసిస్టెంట్లు) బంధువులను పిలిచి ఆడబిడ్డను వారి చేతికి ఇవ్వాలంటే రూ.500 నుంచి రూ.1,000 వరకు డిమాండు చేస్తున్నారు. మగ బిడ్డ పుడితే రూ.2వేలు వరకు అడుగుతున్నారు. ఇవ్వకుంటే శిశువును కనీసం చూపించడం లేదు. తమ దగ్గర సొమ్ము లేదని, బంధువులు వచ్చాక ఇస్తామని చెప్పినా వినడం లేదు. పక్క బెడ్‌ వారి వద్ద అప్పు తీసుకుని, మాకిచ్చి మీ వాళ్లు తర్వాత వాళ్లకు ఇవ్వండి అని దబాయిస్తున్నారు. నిలదీస్తే తల్లీపిల్లలకు సరైన వైద్యం చేయరనే భయంతో వారిని ఏమీ అనలేక, అప్పో సొస్పో చేసి వారు అడిగిన మొత్తం ఇస్తున్నాం. 

దేవమణి, బాలింత తల్లి, వేంపల్లె


బెదిరించి మరీ వసూలు చేస్తున్నారు

ప్రసవాల విభాగంలో సీసీ కెమెరాలు, వైద్యులు, నర్సులు, భద్రతా సిబ్బంది చాలామంది ఉంటారు. ఇంత మంది ఉన్నా కొందరు దౌర్జన్యం చేసి బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటే వారంతా ఒక్కటేనని అర్థమవుతోంది. అధికారులు, వైద్యులు, నర్సులందరూ వారికి అనుమతులిచ్చి డబ్బులు వసూలు చేయిస్తున్నారేమోనని అనుమానం వస్తోంది. ఇక్కడికి ఎక్కువగా పేదలే వస్తుంటారు. వారి దగ్గర వేలాది రూపాయలు లాక్కుంటున్నారు. ఇవ్వకుంటే బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలి. 

సుబ్బులమ్మ, బాలింత అక్క, రామాపురం


ఇష్టానుసారం మాట్లాడుతున్నారు

గర్భిణులు ఆసుపత్రికి వస్తే కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. నిండు చూలాలు అనే కనికరం కూడా లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. దీంతో భయమేసి చాలా మంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ఏం అడిగినా సిబ్బంది పలకరు. కొంచెం గట్టిగా అడిగితే మర్యాద లేకుండా దుర్భాషలాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ ఏ మాత్రం లేదు.

కళావతి, బాలింత తల్లి, ఖాజీపేట


చర్యలు తీసుకుంటాం

ఆసుపత్రిలో అన్ని సేవలూ ఉచితమే. ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలా వసూలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రోగుల పట్ల సిబ్బంది సహనంతో ఉండి వైద్యం అందించాలి. సమస్య ఏదైనా ఉంటే బాధితులు మాకు ఫిర్యాదు చేయండి.

డాక్టర్‌ రమాదేవి, సూపరింటెండెంట్‌, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని