logo

బడుగు వికాసమంటూ డప్పు... ముంచేసి మిగిల్చావు అప్పు..!

సీఎం జగన్‌ ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు ఉరేసింది. వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలేనంటూ గొప్పగా ప్రకటించింది.

Updated : 16 Apr 2024 06:24 IST

ప్రోత్సాహకాలిస్తామని మోసం
ఎంఎస్‌ఎంఈలకూ జగన్‌ ఉరి
చితికిపోయిన పేదల జీవితాలు
ఈనాడు, కడప

సీఎం జగన్‌ ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు ఉరేసింది. వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలేనంటూ గొప్పగా ప్రకటించింది. మానవత్వమే పునాదిగా ప్రభుత్వం పనిచేస్తుందని, అది మరవద్దని కలెక్టర్లకు ఉద్బోధించిన సీఎం జగన్‌ కష్టాల కొలిమిలోకి నెట్టేశారు. కొవిడ్‌ కష్టకాలంలో ఎంఎస్‌ఎంఈల అత్యవసర రుణవసతి హామీకి మోదీ ప్రభుత్వం ఆర్థికసాయం అందించగా, ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుని భ్రష్టుపట్టిన చరిత్ర జగన్‌ సర్కారుది. కొవిడ్‌ కష్టాల నుంచి చిరు వ్యాపారులను ఒడ్డున పడేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈల నిర్వచనం పరిధిని విస్తరించింది. గత రెండేళ్లుగా ప్రోత్సాహక బకాయిలను విడుదల చేయకుండా బిగపట్టి వాటి ఉసురుపోకున్నది జగన్‌ ప్రభుత్వమే.

దీనికి తోడు వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా శ్రీకారం చుట్టిన వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకం పేదలను నిరుపేదలుగా మార్చేసింది. లబ్ధిదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. రాయితీ పేరుతో దళిత, గిరిజనులకు మాయమాటలు చెప్పి రుణాలు అంటగట్టారు. పథకం కింద నాలుగేళ్లయినా ఒక్క రూపాయి కూడా రాయితీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీంతో బ్యాంకు రుణాలు తిరిగి కట్టేందుకు కన్న పిల్లల్లా చూసుకున్న పశువులను అమ్ముకుని, బంగారం తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది. అక్కడికీ రుణం తీరకపోవడంతో కొనుగోలు చేసిన వాహనాలను సైతం వెనక్కి ఇచ్చేయాల్సిన దుస్థితి నెలకొంది. జగనన్నా...మా మొర ఆలకించండంటూ ప్రాధేయపడుతున్నా కరుణించకపోవడం వైకాపా ప్రభుత్వం దుర్మార్గపు పాలనకు తార్కాణం.


రోడ్డెక్కిన బాధితులు

నా ఎస్సీ...ఎస్టీ అంటూ ఊదరగొట్టే సీఎం తమను జగన్‌ మోసం చేశారంటూ ఇటీవల కడప నగరంలో దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. నగరంలోని అంబేడ్కర్‌ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సంబంధించి తమకు చెల్లించాల్సిన ప్రోత్సాహక మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. దళిత, గిరిజనులకు ప్రోత్సాహకాలిచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పి నట్టేట ముంచిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో ప్రోత్సాహక మొత్తం కింద దళితులకు రూ.106 కోట్లు, గిరిజనులకు రూ.12 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉంది. గత ఫిబ్రవరి నాటికి చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం అనంతరం గాలికొదిలేసింది. వందలాది మంది బాధితులు ఆర్థికంగా ఎదగకపోగా, తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొనడం గమనార్హం.


నిండా ముంచేశారు

-నిర్మల, మాసాపేట, కడప

వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకం కింద రూ.12 లక్షలతో కారు కొనుగోలు చేశాం. పథకం కింద ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తామనే పూచీతో బ్యాంకు రుణం తీసుకున్నాం. ఇప్పుడు కారు రుణం తీర్చడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ ఇవ్వకుండా ముంచేసింది. ఆస్తులమ్మి రుణం చెల్లించాల్సిన పరిస్థితికి వచ్చేశాం. ప్రభుత్వం మాటివ్వడంతోనే కారు కొనుగోలుకు వెళ్లాం. ఎన్నికలొచ్చేశాయి.. ప్రభుత్వంపై ఆశలు లేకుండా పోయాయి. ఇంతగా మోసం చేయడం దారుణం.  


ప్రభుత్వం దగా చేసింది

శ్రీలక్ష్మీనరసింహా అంబులెన్స్‌ సర్వీస్‌ పేరిట అంబులెన్స్‌ కొనుగోలు చేసిన బాధితుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. రుణం సకాలంలో చెల్లించని కారణంగా బ్యాంకు ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వ హామీతోనే కొత్త వాహనం కొన్నప్పటికీ, దీని కోసమని పాత వాహనాన్ని నష్టానికి విక్రయించారు. తీరా రుణం చెల్లించలేని పరిస్థితిలో బ్యాంకు వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. రూ.8 లక్షలు చెల్లించిన అనంతరం కూడా బ్యాంకు సీజ్‌ చేసింది. ప్రభుత్వ రాయితీ రాదంటూ బ్యాంకు అధికారులు తేల్చి చెప్పేసి వాహనాన్ని తీసుకెళ్లిపోయారు.


మోసపోయాం... నష్టపోయాం

-ఆర్‌.ఎన్‌.రాజా, సీకే దిన్నె

వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకం కింద రెండు బస్సులను తీసుకున్నాను. ఆర్టీసీకి అద్దె కింద నడపడానికి తక్కువ ధరతో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బస్సుల కొనుగోలుకు ప్రభుత్వ ప్రోత్సాహకం కింద రూ.41 లక్షలు ఇస్తామనే హామీతో బ్యాంకు రుణం తీసుకున్నాను. రాయితీని ప్రభుత్వం చెల్లించకపోవడంతో రుణం చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అప్పులపాలై నలిగి పోతున్నాం. 


నెలలతరబడి ఎదురుచూపులు

-మంజునాథరెడ్డి, విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌, మైదుకూరు

రెండేళ్ల కిందట రూ.2 కోట్లతో విత్తన ప్రాసెస్సింగ్‌ పరిశ్రమను ఏర్పాటు చేశాను. ఏడు నెలల కిందట రూ. 29.5 లక్షల రాయితీ మంజూరైనా ఇంతవరకు అందలేదు. అధికారుల వద్దకు వెళ్లాం. ప్రభుత్వం మంజూరు చేస్తే ఇస్తామని చెబుతున్నారు. నాతోపాటు చాలామందికి రాయితీ రావాల్సి ఉంది. అప్పులు చేసి వ్యాపారం చేసుకుంటున్నాం. ఇంతవరకూ మంజూరు కాలేదు.


ప్రోత్సాహకం లేక నష్టాలు

-రమణారెడ్డి, విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌, మైదుకూరు

ప్రొద్దుటూరులో పరిశ్రమలశాఖకు స్థలాల్లేవు. ప్రైవేటుగా పెట్టాలనుకుంటే స్థలాల ధర ఎక్కువగా ఉంది. మైదుకూరు ప్రాంతంలో పరిశ్రమల్లేకపోవడంతో వ్యాపారం బాగుంటుందని, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని మైదుకూరులో విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పాను. ఇప్పటికి ఏడు నెలలైంది. రాయితీ కోసం దరఖాస్తు చేశాను. ప్రాసెస్‌లో ఉందంటున్నారే గానీ రాయితీ రావడం లేదు. 


ఎస్సీ, ఎస్టీల ప్రగతి నిర్వీర్యం

-ఆర్‌.ఇమ్మానుయేల్‌, రాష్ట్ర అధ్యక్షుడు, మాలమహానాడు, ప్రొద్దుటూరు

సీఎం జగన్‌ 2022 మార్చి, 2023 జులై 4న సంక్షేమ క్యాలెండరు ద్వారా ఎంఎస్‌ఎంఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన రాయితీలను విడుదల చేస్తామని ప్రకటించారు.. ఎస్సీ, ఎస్టీలతో హయర్‌ బస్సులను కొనేట్లు ప్రోత్సహించి, ఇన్సెంటివ్‌ ఇవ్వకుండా ముఖం చాటేశారు. రూ.650 కోట్లు ఇన్‌సెంటివ్‌ బకాయిలు పెండింగులో ఉన్నా ఒక్క ఫైసా విదల్చకుండా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని నిర్వీర్యం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని