logo

అనిశా వలలో ట్రాన్స్‌కో జలగ!

నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.

Published : 01 May 2024 01:35 IST

నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు
రూ.32 వేలు తీసుకుంటుండగా పట్టివేత

వెంకటరత్నం, ట్రాన్‌కో ఏఈ

అంగళ్లు (కురబలకోట), న్యూస్‌టుడే : నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు. కురబలకోట మండలంలో మంగళవారం జరిగిన ఈ ఉదంతం వివరాలను కడప ఏసీబీ డీఎస్పీ వి.గిరిధర్‌ మీడియాకు తెలిపారు. తెట్టు పంచాయతీ చింతపల్లెకు చెందిన మధుకర్‌రెడ్డి, అతని తండ్రి రాజారెడ్డి, చిన్నాన్న రఘునాథరెడ్డి రైతులు. వీరికి సర్వే నంబరు 659-2లో 14 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం గతేడాది నవంబరు 23న రెండు విద్యుత్తు సర్వీసులకు సంబంధించి రూ.23,300 చొప్పున రూ.46,600 చెల్లించారు. కనెక్షన్లు ఇవ్వాలని అంగళ్లులోని విద్యుత్తు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేక పోయింది. ఈ క్రమంలో గట్టిగా అడిగితే లంచం ఇవ్వనిదే కనెక్షన్లు మంజూరు చేయనని ఏఈ వెంకట రత్నం చెప్పారు. రెండు కనెక్షన్లకు సంబంధించి రూ.35 వేలు లంచం డిమాండు చేయగా అంత ఇచ్చుకోలేమని బతిమాలుకున్నారు. ఇంతలో సర్దుకున్న ఏఈ ఎట్టకేలకు రూ.32 వేలకు బేరం కుదుర్చుకున్నా,రు. ఏఈ ఇచ్చిన సమాధానం చరవాణిలో రికార్డు చేసి సమాచారాన్ని కడపలోని అనిశా అధికారులను అందజేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. వారి సూచన మేరకు అడిగిన డబ్బు ఇస్తానని, ఎక్కడికి రావాలో చెప్పాలని ఏఈకి ఫోన్‌ చేయించగా మంగళవారం కదిరి రోడ్డులోని ఓ కళాశాల ఎదురుగా ఉన్న టీ స్టాల్‌ వద్దకు రావాలని సూచించారు. దీంతో వల పన్నిన అనిశా అధికారులు డబ్బులు తీసుకుంటున్న ఏఈని అక్కడే కాపు కాసి పట్టుకున్నారు. ట్రాన్స్‌కో కార్యాలయానికి తరలించి విచారణ అనంతరం ఏఈపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని