logo

రాజంపేటలో గందరగోళం

రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన బూత్‌లో సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్‌ ముగిసింది.

Published : 06 May 2024 04:06 IST

గుమిగూడిన తెదేపా, వైకాపా శ్రేణులు

రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద గుమికూడిన తెదేపా, వైకాపా శ్రేణులు

రాజంపేట, రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన బూత్‌లో సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ పెట్టెలను తరలించే సమయంలో అన్ని బాక్సులకు సీల్‌ వేసిన అనంతరం కొందరు ఏజెంట్లు వెళ్లిపోయారు. తరువాత ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి తొమ్మిది బాక్సులను కలిపి ఒకే బాక్స్‌లోకి వేసి కట్టలు కట్టాలని పోలింగ్‌ సిబ్బంది మరోసారి చెప్పడంతో అక్కడే ఉన్న తెదేపా ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. ఒకసారి సీజ్‌ చేసిన బాక్స్‌లను సీజ్‌ తొలగించడం ఏంటంటూ వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా, వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్‌ బాక్సులున్న గదిలో వాదోపవాదనలు సాగడంతో పోలీసులు లోపలికి వచ్చి సర్దుబాటు చేశారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మోహన్‌రావు అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను ఒకే బాక్సులో వేయాల్సి ఉందని.. సంబంధిత ఏజెంట్లు ఉంటే వారి సమక్షంలోనే సీజ్‌ చేసిన బాక్సులను తెరచి మళ్లీ ఒక దానిలో ఒకటి వేస్తామని చెప్పడంతో తెదేపా ఏజెంట్లు వ్యతిరేకించారు. ఎన్నికల నిబంధనకు సంబంధించిన కాగితాన్ని చూపడంతో చివరికి సమ్మతించారన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత బాక్సులను సీజ్‌ చేసిన సమయంలో బయట నుంచి రెండు వాహనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రెండు వాహనాల్లో అక్కడి వచ్చారని.. దొంగ ఓట్లు చేర్చే ప్రయత్నం జరిగిందని తెదేపా నాయకులు ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద తమను చూసి వాహనాల్లో వచ్చినవారు పరారైనట్లు చెప్పారు. వారు ఎవరు..? ఎందుకు వచ్చారు..మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయారో అధికారులు విచారించాలని డిమాండు చేశారు. డిగ్రీ కళాశాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఓసారి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని