logo

యజమాని వేధింపులతో చేనేత కార్మికుడి బలవన్మరణం

మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Published : 08 May 2024 05:35 IST

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని చౌడేశ్వరినగర్‌కు చెందిన రెడ్డెప్ప, కళావతమ్మల కుమారుడు అశోక్‌బాబు (34) చేనేత కార్మికుడు. ఇతనికి భార్య రెడ్డిరాణి, కుమారుడు చక్రధర్‌ (10) కుమార్తె వర్షిత (3) ఉన్నారు. రెడ్డిరాణి ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. అశోక్‌బాబు నీరుగట్టువారిపల్లెకు చెందిన ఎరుకలరెడ్డి వద్ద కూలి మగ్గం నేస్తాడు. యజమాని భార్యతో ఆశోక్‌బాబు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో ఎరుకలరెడ్డి అతని కుటుంబ సభ్యులు గత నెల 30న అతనిపై దాడి చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా ఏదైనా తీసుకుని చనిపోవాలని లేకుంటే తామే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన అశోక్‌బాబు ఈ నెల 2వ తేదీన బాబుకాలనీ సమీపంలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అశోక్‌బాబు మృతి చెందాడు. మృతుడి తండ్రి రెడ్డెప్ప తన కుమారుడి మరణానికి మగ్గాల యజమాని ఎరుకలరెడ్డి, అతని భార్య సుభద్ర, అనుచరులు చలపతి, రాజేష్‌లే కారణమని ఫిర్యాదు చేశారు. వారు తీవ్రంగా కొట్టడం వల్లే అవమానం తట్టుకోలేక నిద్రమాత్రలు మింగాడని వారి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. రూరల్‌ స్టేషన్‌ ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట మండలం బోయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుల్లంపేట మండలం కేతరాజుపల్లి గ్రామానికి చెందిన సాయి (28) రాజంపేట పట్టణంలోని ఓ పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి హరిత హోటల్‌ నుంచి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ప్రైవేటు ట్రావెల్‌ బుస్సు వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుప్రతికి 108లో తరలించారు. మెరుగైన వైద్య కోసం కడప రిమ్స్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు