logo

అకాల వర్షం... అపార నష్టం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఉద్యాన పంటలైన మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో మామిడి, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి.

Published : 09 May 2024 04:53 IST

బి.కొత్తకోటలో 80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
జిల్లావ్యాప్తంగా ఉద్యాన తోటలు, పంటలకు దెబ్బ

రాజంపేట మండలం ఆకేపాడులో గాలివానకు నేలకూలిన అరటి తోట వద్ద రైతులు

రాయచోటి, రాజంపేట గ్రామీణ, బి.కొత్తకోట, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఉద్యాన పంటలైన మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో మామిడి, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. సుమారు వెయ్యి ఎకరాల్లో తోటలు నేలకొరిగినట్లు అంచనా. కోతకు వచ్చిన మామిడి కాయలు రాలి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి, హస్తవరం, పెద్దకారంపల్లి, మిట్టమీదపల్లి, పులపుత్తూరు, కూచివారిపల్లి, వరదయ్యగారిపల్లి, ఊటుకూరు పంచాయతీల్లో సాగు చేస్తున్న అరటి తోటలు పూర్తిగా నేలకొరిగాయి. మొత్తం 190 మంది రైతులు సాగు చేసిన 483 ఎకరాల్లో అరటి తోటలకు రూ.3.86 కోట్ల నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

జిల్లా అంతటా భారీ వర్షం : జిల్లాలోని 30 మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బి.కొత్తకోటలో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మదనపల్లెలో 72, రామా పురంలో 60.2, వీరబల్లిలో 55.2, రైల్వేకోడూరులో 50.2, ములకలచెరువులో 49.4, రాజంపేటలో 48.6, సుండుపల్లిలో 42.0, పెద్దమండెంలో 39.2, పుల్లంపేటలో 38.0, పీటీఎంలో 32.6, పెనగలూరులో 32.0 మిల్లీ మీటర్ల చొప్పున నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ 10 నుంచి 30 మిల్లీ మీటర్లలోపు వర్షం కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని