logo

రాయలసీమలో ప్రాజెక్టుల పూర్తికి ప్రధాని భరోసా

ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టడంతో సీమ ప్రజలు పులకించిపోయారు. ముఖ్యంగా భాజపా నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండడం, ఆయన గెలుపు కోసం మోదీ ఇక్కడకు రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Updated : 09 May 2024 06:06 IST

పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి కల్పన హామీ
కలికిరిలో ప్రజాగళం బహిరంగ సభ విజయవంతం

 

ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టడంతో సీమ ప్రజలు పులకించిపోయారు. ముఖ్యంగా భాజపా నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండడం, ఆయన గెలుపు కోసం మోదీ ఇక్కడకు రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కలికిరిలో బుధవారం ప్రధాని  
నరేంద్రమోదీ సభ విజయవంతం కావడం ఎన్డీఏ కూటమి నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. తెదేపా, జనసేన, భాజపా నేతలందరూ ఒకే వేదికపై కనిపించడం ప్రజలకు కనువిందు చేసింది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా, ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి తెదేపా పీలేరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రాంతంలో సభ నిర్వహించడంతో ఆ ప్రాంతమంతా మురిసిపోయింది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. సభా ప్రాంగణమంతా నిండిపోవడంతో చాలామంది వెలుపల నిల్చుని ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం పూర్తయ్యేవరకు ఆసక్తిగా ఆలకించారు.

కూటమి బలం : ఐక్యత చాటుతున్న ప్రధాని మోదీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, లోకేశ్‌, నాగబాబు, కూటమి అభ్యర్థులు, నాయకులు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కలికిరి, కలికిరి గ్రామీణ: ప్రధాని తన ప్రసంగంలో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ అవలంభిస్తున్న విధానాలను దుయ్యబట్టడంతోపాటు రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు అవసరమైన పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువత వలసబాట పట్టకుండా వారికి స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం యువతలో నూతనోత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఇక్కడ టమాట రైతులను ఆదుకునేందుకు టమాట ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంపై రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. నరేంద్రమోదీ కలికిరి పర్యటన ఇటు కూటమి అభ్యర్థుల్లో బలాన్ని మరింత పెంచడంతోపాటు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారన్న విషయం ప్రస్ఫుటం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కలికిరిలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎటు చూసినా జనమే :  కలికిరి సభ వద్ద జనసందోహం

అందరికీ ధన్యవాదాలు

కేంద్రంలో భాజపాకు 370 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి. ఇందులో రాజంపేట కూడా ఒకటి కావాలి. 13వ తేదీన ఓట్ల పండగ రోజు అందరూ కూటమికి ఓటేసి కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానిగా, రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ప్రధాని మోదీ హాజరైన సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. సభ ద్వారా రానున్న ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమైందన్న విషయం స్పష్టమైంది. వారందరికీ కృతజ్ఞతలు.

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి

దారులన్నీ కలికిరి వైపే

కలికిరిలోని ప్రధాని మోదీ ప్రజాగళం సభకు రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపలె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పుంగనూరు నియోకవర్గాలతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల  నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. సభా ప్రాంగణంలో ఆహూతులు ఇబ్బందులు పడకుండా కూలర్లు ఏర్పాటుచేశారు. డిజిటల్‌ తెరలు పెట్టారు.  మూడు పార్టీల శ్రేణుల నినాదాలతో సభ హోరెత్తింది. ప్లకార్డులు చూపుతూ.. అగ్రనేతకు జేజేలు పలికారు. తెదేపా-భాజపా-జనసేన జెండాలతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

నేతల ప్రసంగాలతో మార్మోగిన సభాప్రాంగణం

సభకు కూటమి దళం కదం తొక్కింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో యువత ఒక్కసారిగా కుర్చీలపై నిల్చుని ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి  నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా పీలేరు అసెంబ్లీ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిల ప్రసంగాల సమయంలో సభా ప్రాంగణమంతా కేరింతలతో మార్మోగిపోయింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ఎన్టీఆర్‌ తెలుగుగంగ తెచ్చారు

రత్నాల సీమ రాయలసీమ. ఇది పౌరుషాల గడ్డ. నాడు ఎన్టీఆర్‌ రాయలసీమను రత్నాలసీమగా చేసేందుకు తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకొచ్చారు. చంద్రబాబునాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, కార్బన్‌, టీసీఎల్‌ వంటి సంస్థలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

నారా లోకేష్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని