logo

మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం

మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

Published : 10 May 2024 02:33 IST

గొల్లలగూడూరులో మహిళల సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల

లింగాల, వేముల, న్యూస్‌టుడే : మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. గురువారం లింగాల మండలం పార్నపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, అంబకపల్లె, వేముల మండలంలోని గొల్లలగూడూరు, చింతలజూటూరు, పెద్దజూటూరు, సిద్దంరెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జే బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వైకాపా పాలనలో మద్యం, ఇసుక మాఫియా పెరిగిపోయాయన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు లేవన్నారు. ఎంత సరకు విక్రయిస్తున్నారో లెక్కల్లేవని మండిపడ్డారు. అంతా జీరో అకౌంట్‌, ఇది సరిపోనట్లు కంటైనర్లలో డ్రగ్స్‌ సరఫరా అవుతోందన్నారు. ప్రతి సంక్రాంతికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్నా పది కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం జగన్‌ మూడు రాజధానులు కడతానన్నారు. ఒక్కటైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన అవినాష్‌రెడ్డి జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు. సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించలేదన్నారు. మరోసారి ఆయనకు ఓట్లేసి మోసపోవద్దని కోరారు. ఎన్నికల్లో అవినాష్‌ ఓటమి చవిచూడడం ఖాయమన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకుని ఇతర దేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. వివేకా ఆత్మకు శాంతి కలగాలంటే హస్తం గుర్తుకు ఓటువేసి షర్మిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు