logo

జగన్‌ సభ వెలవెల

సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది.

Published : 10 May 2024 02:36 IST

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై నిరాశ
ప్రారంభంలోనే ఇంటి ముఖం పట్టిన జనం

జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

రాజంపేట గ్రామీణ, రాజంపేట, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది. మధ్యాహ్నం 4 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా, 4.15 గంటలకు ప్రచార వాహనంపైకి జగన్‌ వచ్చారు. చాలా మంది ప్రజలు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు దుకాణాల నీడన తలదాచుకున్నారు. సభ నేపథ్యంలో రాజంపేట పాత బస్టాండు సమీపంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. అనంతరం సీఎం జగన్‌ 40 నిమిషాల పాటు ప్రసంగించి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగంలో కొత్తదనం లేదు.

సీఎం జగన్‌ మాట్లాడుతున్న సమయంలో తిరిగి వెళ్లిపోతున్న మహిళలు, ప్రజలు

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగింది. రాజంపేటలో సభ కోసం పాత బస్టాండు రహదారిలోని దుకాణాలను పోలీసులు ఉదయం నుంచే మూయించారు. బ్యారికేడ్లు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలు నిషేధించారు. సభ కోసం మధ్యాహ్నానికి జనాలు తీసుకొచ్చారు. తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. సభకు వచ్చిన జనానికి వైకాపా నేతలు మద్యం సీసాలు పంపిణీ చేశారు. రాజంపేట నుంచి రాపూరు, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు చక్రాలమడుగు వద్ద ఉంచడంతో ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రజలు ఇబ్బందులుపడ్డారు. చిట్వేలికి వెళ్లాల్సిన విద్యార్థులు డివైడర్‌పైనే నిల్చుని బస్సులు కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీఎం జగన్‌ ప్రసంగం మొదలు పెట్టిన పది నిమిషాలకే మహిళలు, ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు విధించిన నిబంధనలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజంపేట ప్రధాన రహదారులపై వాహనాలు తిరిగేందుకు అనుమతులు లేవని చెప్పడంతో ప్రజలు, ఆసుపత్రికి వచ్చే రోగులు, చిన్న చిన్న పనులు చేసుకుని ఇళ్లకు వెళ్లే కూలీలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని