logo

సరకులిస్తానని డప్పు... ఉడకలేదు కందిపప్పు!

బక్కజీవుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించే ప్రజా పంపిణీ వ్యవస్థను సీఎం జగన్‌ నీరుగార్చారు. సరకుల్లో కోత పెట్టారు. మరోవైపు ధరల మోతతో బడుగులపై అదనపు భారం వేశారు.

Updated : 10 May 2024 05:25 IST

జగన్‌ పాలనలో నిత్యావసరాల పంపిణీ అస్తవ్యస్తం
పండగ కానుకలకూ మంగళం పాడేసిన వైకాపా ప్రభుత్వం

బక్కజీవుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించే ప్రజా పంపిణీ వ్యవస్థను సీఎం జగన్‌ నీరుగార్చారు. సరకుల్లో కోత పెట్టారు. మరోవైపు ధరల మోతతో బడుగులపై అదనపు భారం వేశారు. సన్న బియ్యం ఇస్తామని ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఇంటింటికీ నిత్యావసరాలు అందజేసేలా సంచార వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినా లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. సాంకేతిక లోపాలతో వేలిముద్రలు సక్రమంగా నమోదు కాకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రంజాన్‌, క్రిస్మస్‌, సంక్రాంతి పండగల వేళ కానుకలను ఉచితంగా పంపిణీ చేస్తే జగన్‌ జమానాలో మంగళం పాడేశారు. 

న్యూస్‌టుడే, కడప, అరవిందనగర్‌ (కడప), ప్రొద్దుటూరు గ్రామీణం

గత తెదేపా ప్రభుత్వ హయాంలో 6 నుంచి 12 రకాల సరకులను రాయితీపై ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోత పెట్టారు. బియ్యం మాత్రం ఇస్తున్నారు. పంచదార తొలుత వెళ్లిన వారికే దక్కుతుంది. ఒక నెల ఇస్తే.. మరో నెల లేదు.  గోధుమలు, గోధుమ పిండి, ఉప్పు తదితర రకాలు ఇవ్వడం లేదు. తెదేపా పాలనలో ప్రతి కుటుంబానికి రెండు కిలోల కంది పప్పు ఇచ్చారు. కిలో రూ.40 మాత్రమే. వైకాపా వచ్చాక కిలోకు తగ్గించారు. అది కూడా రూ.67 పెంచారు. అయినా సక్రమంగా పంపిణీ చేయలేదు. కనీసం పండగ పూట కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ పాలనలో సన్న బియ్యాన్ని తక్కువే ధరకే ఇస్తామని జగన్‌ ఆర్భాటంగా రెండేళ్ల కిందట ప్రకటించారు.  అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం దొడ్డుబియ్యం ఇస్తున్నారు.

కొత్తమాధవరంలో సరకులు తీసుకుంటున్న లబ్ధిదారులు

పేదలకు ఆర్థిక భారం

ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.200పైగా కందిపప్పు ధర ఉంది. అంత డబ్బుపెట్టి కొనాలంటే పేదలకు ఆర్థిక భారంగా ఉంటుంది. రేషన్‌ దుకాణాల్లో బియ్యం, చక్కెర తప్పా కందిపప్పు ఇస్తున్నది లేదు. గతంలో రెండు కిలోల కంది పప్పు ఇచ్చేవారు. దానికి కిలోకు తగ్గించారు. అది కూడా నెలలుగా పంపిణీ చేయడం లేదు. జగన్‌ ప్రభుత్వంలో నిత్యావసర సరకులకు కోతపెట్టడం అన్యాయం, మోసం.

షేక్‌ బీబీ, కామనూరు. ప్రొద్దుటూరు మండలం

ఇంటింటికీ వాహనాలు రావడం లేదు

తెదేపా ప్రభుత్వంలో చౌకదుకాణాల వద్దకు ఏదో ఒక సమయంలో వెళ్లి సరకులు తెచ్చుకునేవాళ్లం. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇంటివద్దకే రేషన్‌ అంటూ ఊదరగొట్టారు. ఎక్కడో వీధి చివర వ్యాన్‌ ఉంటుంది. ఐదు దాటితే వెళ్లిపోతుంది. మళ్లీ పరుగెత్తికెళ్లి చౌక ధరల దుకాణం, సచివాలయం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.   చాలా మంది పేదలు బయట కొనుగోలు చేసి పప్పు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మద్దూరు రాయుడు, కడప

బియ్యం, పంచదారతో సరిపెట్టేస్తున్నారు

వైకాపా పాలనలో చౌక ధరల దుకాణాల్లో బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. గతంలో కందిపప్పు గతంలో కిలో రూ.40కు ఇవ్వగా, జగన్‌ సీఎం అయిన తర్వాత రూ.67కు పెంచారు. అయినా మూడు, నాలుగు నెలలకొకసారి కూడా పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. బయట మార్కెట్‌లో విపణిలో ధరలు కొండెక్కాయి. రాగులు, గోధుమ పిండి, గోధుమలు, ఉప్పు, ఇతర సరకులు కూడా ఇవ్వలేదు. సంక్రాంతి కానుకలను కూడా నిలిపివేశారు. 

 నూకల కవిత, కొత్త మాధవరం

గత ప్రభుత్వంలోనే మేలు

తెదేపా పాలనలో పండగలొస్తే రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలను ఇచ్చారు. మాలాంటి పేదలకు ఆర్థికంగా ఉమశమనం లభించింది. రాష్ట్రంలో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆపేశారు. ఇది చాలా అన్యాయం. బియ్యం, చక్కెర ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. రేషన్‌ సరకుల కోసం పరేషాన్‌ పడుతున్నాం.

 ఎన్‌.వెంకటసుబ్బమ్మ, కొత్తమాధవరం

నిర్లక్ష్యం వహించడం తగదు

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చౌక ధరల దుకాణాల నుంచి బియ్యం, చక్కెర, గోధుమపిండి, కందిబేడలు, చిన్న చిన్న సరుకులు కూడా అందుబాటులో ఉంచి అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కేవలం బియ్యం, చక్కెరకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు రాగులు ఇస్తున్నారు. రేషన్‌ సరకులపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. పేదల కష్టాలు ఈ ప్రభుత్వానికి తప్పడం లేదు.

 కుమారి,  కడప

నెలలుగా అదిగో... ఇదిగో 

మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయాలంటే వీలు లేకుండా ఉంది. ప్రత్యామ్నాయంగా చౌక ధరల దుకాణాల్లో తక్కువ ధరలకు వాటిని అందజేస్తే కుటుంబాలకు ఆదాయం మిగులుతుంది. జగన్‌ ప్రభుత్వంలో ఎప్పుడూ చూసినా నాణ్యత, మన్నిక లేని బియ్యం, చక్కెర ఇస్తున్నారు. అత్యవసరమైన కందిపప్పు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు. నెలలుగా అదిగో, ఇదిగో అని చెప్పడం తప్పా ఇంతవరకు కందిపప్పు ఇచ్చిన పాపాన పోలేదు.

పేట సుబ్బరాయుడు, సీతంపల్లె, ప్రొద్దుటూరు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని