logo

అభివృద్ధి పనులపై ఉప రాష్ట్రపతి ఆరా

మూడ్రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం స్థానిక అభివృద్ధి పనులపై ఆరా తీశారు. చెన్నై-

Published : 19 Jan 2022 03:31 IST

స్వర్ణభారత్‌ ట్రస్టులో పర్ణశాలలో ఊయల ఊగుతున్న వెంకయ్యనాయుడు

ఆత్కూరు (గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: మూడ్రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం స్థానిక అభివృద్ధి పనులపై ఆరా తీశారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి వచ్చిన ఉప రాష్ట్రపతి హైవే విస్తరణ పనులు, చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు నూతనంగా నిర్మిస్తున్న ఆరులైన్ల నూతన రహదారి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం విద్యార్థులతో ముఖాముఖి అనంతరం పలువురు అధికారులు, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు ఉప రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు.

విశ్వవిద్యాలయ సమస్య పరిష్కరించాలని వినతి
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా అపరిషృతంగా ఉన్న విభజన అంశాలపై ప్రత్యేక చొరవ చూపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని డా.బీఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏపీ ప్రత్యేకాధికారి డా.వెలగా జోషి అభ్యర్థించారు. ఉంగుటూరు మండలం స్వర్ణభారత్‌ ట్రస్టులో ఉపరాష్ట్రపతిని మంగళవారం ఉదయం మర్యాద పూర్వకంగా జోషి కలిశారు. రాష్ట్రంలో 76 అధ్యయన కేంద్రాలుండగా వాటిలో కేవలం 26 మంది శాశ్వత, 13 మంది పెన్షనర్లు, 456 మంది పార్ట్‌టైం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. 30 వేల పైబడిన డిగ్రీ, పీజీ, డిప్లొమా విద్యార్థులతో సుమారు రూ.11 కోట్ల వార్షిక ఆదాయంతో పాటు ఏటా జీపీఎఫ్‌, ఇతర మార్గాల్లో మరో రూ.36 లక్షలను హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం వసూలు చేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం సమస్య పరిష్కరించాలని ఉపరాష్ట్రపతిని జోషి కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించాలని పేర్కొన్నారు.


నేడు నూజివీడు రైల్వే స్టేషన్‌ నుంచి విశాఖకు పయనం

ఏర్పాట్లపై సమీక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో రాజ్యలక్ష్మి

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం నూజివీడు రైల్వే స్టేషన్‌కు రానున్నారు. విశాఖ పర్యటనకు వెళుతున్న ఆయన ఉదయం ఆరు గంటలకు నూజివీడు స్టేషన్‌లో ప్రత్యేక రైలులో ఎక్కనున్నారు. ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి 16వ జాతీయ రహదారి మీదుగా హనుమాన్‌జంక్షన్‌ చేరుకుని, ఒకటో ప్లాట్‌ఫాం నుంచి రైలు ఎక్కనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఉప రాష్ట్రపతి రాక నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం సాయంత్రం రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఏఆర్‌ అదనపు ఎస్పీ ప్రసాద్‌, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాట్లు, బందోబస్తు అంశాలపై సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని