logo

గొలుసు తెంచుకొని ఎగిరిపోబోయాడు.. విమానంలో పట్టుకున్న పోలీసులు

ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను బైక్‌పై వెంబడించి మహిళ మెడలోని గొలుసు తెంచుకొని విమానంలో పారిపోవడానికి యత్నించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. గొలుసు లాక్కొనే క్రమంలో మహిళ

Updated : 31 Mar 2022 07:13 IST

హేమంత్‌ గుప్తా

అబ్దుల్లాపూర్‌మెట్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను బైక్‌పై వెంబడించి మహిళ మెడలోని గొలుసు తెంచుకొని విమానంలో పారిపోవడానికి యత్నించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. గొలుసు లాక్కొనే క్రమంలో మహిళ వాహనంపై పడి గాయాలపాలైనా అతను కటువుగా వ్యవహరించాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తూపల్లి నర్సింహారెడ్డి కుటుంబం నగరంలోని హస్తినాపురం అనుపమనగర్‌ కాలనీలో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం నర్సింహారెడ్డి(65) భార్య కమల(55)తో కలిసి బ్రాహ్మణపల్లి వెళ్లారు. మంగళవారం సాయంత్రం బైకుపై తిరిగి వస్తున్నారు. మార్గం మధ్యలో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం వద్ద హైవేపై ఓ దుండగుడు బైక్‌పై వెనుక నుంచి వచ్చి కమల మెడలోని పుస్తెలతాడు తెంచేందుకు యత్నించాడు. ఆమె రోడ్డుపై పడిపోయింది. కొంత దూరం వెళ్లిన నిందితుడు తిరిగొచ్చి కమల మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడు తెంచుకొని నగరం వైపు పరారయ్యాడు. నర్సింహారెడ్డి దొంగను కొంత దూరం వెంబడించినా ఫలితం లేకపోయింది. గాయపడిన కమలను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు వేగంగా స్పందించి హైవేపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. లభించిన సాంకేతిక ఆధారాలతో నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ చన్వర్‌గేట్‌లో నివసించే హేమంత్‌గుప్తా(24)గా గుర్తించారు. గాజుల దుకాణంలో పనిచేసే అతను తాను ఎంచుకున్న ప్రాంతానికి రానుపోను విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకొని గొలుసు చోరీలు చేసి వెళుతున్నాడు. ఇలా ఆరుసార్లు తప్పించుకున్నాడు. ఏడోసారీ తప్పించుకొని విమానంలో పారిపోబోతుండగా, బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్‌, విమానాశ్రయ, ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు. పుస్తెలతాడుతో పాటు, బైకును స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని