logo

తనయుడే లోకం.. మిగిల్చాడు శోకం

తనని తల్లిదండ్రులు ఏ లోటూలేకుండా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. తన మంచి కోసం తండ్రి ఒకమాట అంటే ఏముందిలే.. అని ఆ బాలుడు ఆలోచించలేదు. మనస్తాపం చెంది 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడి కన్నవారికి కడుపు కోత మిగిల్చాడు.

Published : 17 Jan 2022 05:33 IST

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: తనని తల్లిదండ్రులు ఏ లోటూలేకుండా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. తన మంచి కోసం తండ్రి ఒకమాట అంటే ఏముందిలే.. అని ఆ బాలుడు ఆలోచించలేదు. మనస్తాపం చెంది 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడి కన్నవారికి కడుపు కోత మిగిల్చాడు. ఈ విషాదకర ఘటన శేరిలింగంపల్లి నల్లగండ్లలో జరిగింది. చందానగర్‌ ఎస్‌ఐ అహ్మద్‌పాషా తెలిపిన ప్రకారం.. స్థానిక గేటెడ్‌ కమ్యూనిటీ బహుళ అంతస్తుల సముదాయంలోని 14వ అంతస్తులో నివసించే దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వీరికి ఒక్కడే కుమారుడు(13). ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ‘ఆటలు ఎక్కువయ్యాయి. చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఎలా?’ అని ఆదివారం తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన కుమారుడు తాను ఉంటున్న ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకాడు. లాన్‌లో పడిన బాలుడికి కాళ్లు, చేతులు విరిగి, తలకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పిల్లాడిని ఏనాడూ కొట్టడం గానీ, తిట్టడం గానీ చేయలేదని, ఎంతో ప్రేమగా చూసుకునే తమ కుమారుడు ఒక్కమాటకే ఇలా చేస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని