మహా ఘోరకలి!

మాటలకు అందని మహావిషాదాలను మానవమాత్రులు అంత త్వరగా మరచిపోలేరు. బాధితుల స్మృతిపథంలో అవి విధివశాత్తు విరుచుకుపడిన ఉత్పాతాలుగానే మిగిలిపోవు.

Published : 09 Feb 2023 00:06 IST

మాటలకు అందని మహావిషాదాలను మానవమాత్రులు అంత త్వరగా మరచిపోలేరు. బాధితుల స్మృతిపథంలో అవి విధివశాత్తు విరుచుకుపడిన ఉత్పాతాలుగానే మిగిలిపోవు. అనుక్షణం వెంటాడే భయంకర అనుభవాలుగా కొన్నేళ్ల పాటు అవి వాళ్ల గుండెలను వేదనాభరితం చేస్తాయి. తుర్కియే, సిరియాల్లోని పలు ప్రాంతాలను ఒక్కసారిగా శ్మశానవాటికలుగా మార్చేసిన పెనుభూకంపమూ అటువంటిదే. ఆ మహావిలయంలోంచి బతికి బట్టకట్టిన అభాగ్యుల్లో కొంతమంది... విగతజీవులైన తమ ఆప్తులను తలచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. కుప్పకూలిన భవంతుల కింద తమవాళ్ల ఆనవాళ్లకోసం మరెందరో ఆశగా ఎదురుచూస్తున్నారు. తుర్కియేలోనే పదకొండు వేలకు పైగా భవనాలు నేలమట్టమైనట్లుగా నివేదికలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే చితికిపోయిన సిరియాలోనైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నట్లు కథనాలు వెలుగుచూస్తున్నాయి. భూకంప తీవ్రత ధాటికి ఆ రెండు దేశాల్లో దాదాపు ఇరవై వేల మంది వరకు మరణించి ఉండవచ్చునన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. వందల కొద్దీ భూప్రకంపనలు, దారీతెన్నూ తెలియని శిథిలాల కొండలు, నామరూపాల్లేని సమాచార వ్యవస్థలకు తోడు అతిశీతల వాతావరణానికి ఎదురొడ్డుతూ- రాళ్ల గుట్టల కింద కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులకోసం సహాయ బలగాలు అహరహం శ్రమిస్తున్నాయి. మానవతా దృక్పథంతో తుర్కియే, సిరియాలకు ప్రపంచ దేశాలెన్నో ఆపన్న హస్తాలందిస్తున్నాయి. జాతీయ విపత్తు స్పందన దళం సభ్యులు, వైద్య సామగ్రిని ఆగమేఘాల మీద తుర్కియేకు తరలించి ఇండియా తన పెద్దమనసును మరోసారి చాటుకుంది. ప్రకృతి విలయతాండవానికి రెక్కలు తెగిన పక్షులైన బాధిత దేశాలు తెరిపిన పడాలంటే- అంతర్జాతీయ సహకారం, సమన్వయంతో కూడిన సహాయ చర్యలు ప్రాణావసరాలు!

రెండు దశాబ్దాల నాడు జపాన్‌లోని హొక్కాయిదో ప్రాంతాన్ని పట్టి కుదిపేసిన భూకంప తీవ్రత- రిక్టర్‌స్కేల్‌పై ఎనిమిదిగా నమోదైంది. అప్పట్లో ప్రాణనష్టమేమీ సంభవించలేదు. ఇప్పుడు అంతకంటే కొద్దిగా తక్కువగా 7.8 పాయింట్ల తీవ్రతతో తాజా భూకంపం వేల ప్రాణాలను పొట్టనపెట్టుకోవడానికి కారణమేమిటి? భౌగోళిక పరిస్థితుల కారణంగా భూకంపాల ముప్పు అత్యధికంగా ఉన్న తుర్కియేలో నిర్మాణాల పరంగా జాగ్రత్తలను గాలికొదిలేశారు. సులభంగా బీటలువారే కాంక్రీట్‌తో అంతెత్తు భవనాలను కట్టేశారు. నిబంధనలను పాటిస్తూ భూకంపాలను తట్టుకునేలా భవంతులను నిర్మించడం లేదని, తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లోనే అటువంటివి రెండు లక్షల వరకు పోగుపడ్డాయని నిపుణుల సంఘాలు ఏనాటినుంచో మొత్తుకుంటున్నాయి. వాటి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వాల పాపమే నేడు వేల సంఖ్యలో అమాయకుల ఉసురు పోసుకుంది. దేశీయంగానూ 59శాతం భూభాగం భూకంపాల ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. అగర్తలా, ఇంఫాల్‌, కొహిమా, అమృత్‌సర్‌, దిల్లీ, మేరఠ్‌, పట్నా, చెన్నై, ముంబయి, కోల్‌కతా వంటివి తరతమ భేదాలతో ఆ ముప్పు ముంగిట్లో ఉన్నాయి. ఆ నగరాల వరసలోని దేహ్రాదూన్‌లో 59శాతం, లఖ్‌నవూలో 40శాతం భవనాలకు విపత్తు గండం పొంచి ఉందని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) అధ్యయనాంశాలు నిరుడు వెల్లడించాయి. భూగర్భ జలాలను విపరీతంగా తోడెయ్యడంతో దేశ రాజధాని పరిసర ప్రాంతాలకు భూకంపాల ముప్పు తీవ్రతరమైందనీ ఎన్‌జీఆర్‌ఐ గతంలో విశ్లేషించింది. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లోనూ కాళ్ల కింద నేల ఎప్పుడైనా కదిలిపోవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు, ఆపత్కాలంలో వ్యవహరించాల్సిన తీరుపై ప్రజాచేతన కార్యక్రమాలతో ప్రాణ, ఆస్తినష్టాలను జపాన్‌ గణనీయంగా తగ్గించుకోగలుగుతోంది. అటువంటి ముందుచూపు, అప్రమత్తత కొరవడిన ఇండియాలో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలెన్నో ఎప్పుడు ఏ ముప్పు వాటిల్లుతుందోనని బిక్కుబిక్కుమంటున్నాయి. అభివృద్ధి ముసుగులో పర్యావరణ విధ్వంసం, విచ్చలవిడి నిర్మాణ కార్యకలాపాల కట్టడికి ప్రభుత్వాలు ఇప్పటికైనా కంకణబద్ధమవుతాయా? తుర్కియే, సిరియాల పెనువిషాద దృశ్యాలు ఆ మేరకు వాటి కళ్లు తెరిపిస్తాయా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.