నిర్లక్ష్యం నిష్పూచీలే పట్టాలుగా...
భారతీయ రైల్వేల దారుణ నరమేధంలో నెత్తుటేళ్లు పారించిన భీతావహ తాజా ఘట్టమిది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఒక గూడ్స్ బండి వెంటవెంటనే ఢీకొన్న దుర్ఘటన యావత్ జాతినీ దిగ్భ్రాంతపరచింది. ఇప్పటివరకు 288 నిండుప్రాణాల్ని తోడేసిన ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై తొలుత భిన్నకథనాలు వెలువడి గందరగోళం సృష్టించాయి.
భారతీయ రైల్వేల దారుణ నరమేధంలో నెత్తుటేళ్లు పారించిన భీతావహ తాజా ఘట్టమిది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఒక గూడ్స్ బండి వెంటవెంటనే ఢీకొన్న దుర్ఘటన యావత్ జాతినీ దిగ్భ్రాంతపరచింది. ఇప్పటివరకు 288 నిండుప్రాణాల్ని తోడేసిన ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై తొలుత భిన్నకథనాలు వెలువడి గందరగోళం సృష్టించాయి. నిలిపి ఉంచిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి పట్టాలు తప్పిందని, వాటి బోగీలను బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఢీకొట్టిందన్న రైల్వే అధికార ప్రతినిధి వివరణ ఎన్నో సందేహాల్ని లేవనెత్తింది. గూడ్స్ రైలు ఉన్న ట్రాక్‌పైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను ఎలా అనుమతించారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ‘పొరపాటున’ లూప్‌లైన్‌లోకి వెళ్ళిందని, సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యంవల్లే ప్రమాదం చోటుచేసుకుందన్న రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక కథనం విస్మయపరుస్తోంది. అక్కడ ‘రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్’ ఏమైపోయినట్లు? అత్యంత రద్దీగా ఉండే ఆ మార్గంలో రైళ్లు పరస్పరం ఢీకొట్టకుండా నివారించే ‘కవచ్’ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదు? పూర్తిస్థాయి దర్యాప్తు నివేదికలోనైనా ఈ కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలు లభిస్తాయేమో చూడాలి! లోగడ హావ్‌డా నుంచి దిల్లీ వెళ్ళాల్సిన కాల్కా ఎక్స్‌ప్రెస్ యూపీలోని మాల్వా స్టేషన్ చేరువలో పట్టాలు తప్పినప్పుడూ ఇలాగే మరణమృదంగం మోగింది. రెండు స్టేషన్ల మధ్య సరైన ప్రసార వ్యవస్థ లేనందువల్లనే రైళ్లు ఢీకొంటున్నాయని జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా కమిటీ ఈసడించిన సుమారు పాతికేళ్ల తరవాతా ‘సమాచార లోపం’ పునరావృతం అవుతూనే ఉంది. భద్రతకు సంబంధించిన విభాగాలన్నింటా సిబ్బంది కొరత కారణంగానే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను రైల్వేశాఖ మెరుగుపరచుకోలేక పోతోందన్న ‘కాగ్’ విమర్శలూ అరణ్యరోదనమయ్యాయి. దేశంలో లక్షా 40 వేల రైల్వే భద్రతా సిబ్బంది పోస్టులు భర్తీ కాకుండా పోగుపడి ఉన్నాయి. భిన్న అంచెల్లో జవాబుదారీతనం కొల్లబోతోంది. నేటికీ ఆ కంతల్ని పూడ్చటంలో కిరాతక నిర్లక్ష్య పర్యవసానమే, ఒడిశా ఘోరకలి!
రోజూ 22 వేలకు పైగా రైళ్లు 7325 స్టేషన్లను తాకుతూ రెండుకోట్ల 40 లక్షల మంది దాకా ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. అందుకే, ఇంతటి భూరి రైల్వేవ్యవస్థ... ఒక్కముక్కలో, జాతికి జీవనాడి. వాస్తవంలో అది, ప్రయాణికుల భద్రతపై తగినంతగా శ్రద్ధాసక్తులు కనబరుస్తోందా? ప్రణాళికాబద్ధంగా ట్రాక్‌ల నిర్వహణ, కొత్త లైన్ల నిర్మాణం, గేజ్‌మార్పిడి, వృథా వ్యయనియంత్రణ... సాధ్యపడుతున్నాయా? లేనేలేదని పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదికే ధ్రువీకరించింది. ఎవరేమని గొప్పగా ఉద్ఘాటించినా- దేశంలో గూడ్స్‌బళ్లు సగటున సుమారు 23, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 50 కిలోమీటర్ల వేగానికే పరిమితమవుతున్నట్లు కాగ్ నివేదిక నిరుడు ఆక్షేపించింది. ఆ మాత్రం వేగానికే తట్టుకోలేనంతగా ట్రాక్‌ల నిర్వహణ అఘోరిస్తోంది! ‘వందేభారత్’ రైళ్ల గరిష్ఠ వేగానికి తగ్గట్లు పట్టాల నవీకరణ కోసం ఇంకో అయిదారేళ్లయినా పడుతుందంటున్నారు. దేశంలోని రైల్వేలైన్లలో అత్యధికం బ్రిటిష్ జమానాలో వేసినవే. కొత్త లైన్ల నిర్మాణ ప్రతిపాదనలు నిధుల లేమితో చతికిలపడుతుండగా, సిబ్బంది కొరతతో ట్రాక్‌ల నిర్వహణ గాడి తప్పుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని బులెట్‌రైళ్లను పరుగులు తీయిస్తున్న చైనా, జపాన్- ప్రయాణ భద్రతలో, సమయ పాలనలో అద్వితీయంగా రాణిస్తున్నాయి. గంటకు 300 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకుపోయే రైళ్లనూ ప్రమాదం పసిగట్టిన మరుక్షణం 300 మీటర్ల దూరంలో నిలిపేయగల ప్రజ్ఞతో జపాన్ భేషనిపించుకుంటోంది. బండరాళ్లు పడి పట్టాలు ఛిద్రమైనా, అనూహ్య అవాంతరాలు ఏమైనా ఉత్పన్నమైనా- నిమిషాల వ్యవధిలో గుర్తించి అటు వెళ్ళాల్సిన రైళ్లను చైనా వేరే మార్గంలోకి మళ్ళిస్తోంది. అందుకు భిన్నంగా ఇక్కడ రైల్వేశాఖ తక్షణ మరమ్మతుల్లో, మేలిమి డిజైన్లూ కంట్రోల్ కమాండ్ వ్యవస్థల ఆవిష్కరణలో ఎంతగానో వెనకబడిపోయింది. ప్రయాణం అంటే ప్రమాదమన్న దురర్థాన్ని స్థిరీకరించే దుస్థితినుంచి భారతీయ రైల్వే తిరిగి కోలుకుంటుందా? అనూహ్య ప్రమాదాల్లోనూ ప్రాణనష్టం కనిష్ఠస్థాయికి పరిమితమయ్యేలా సకల జాగ్రత్తలూ చేపట్టడంలో పురోగామి దేశాలతో ఇండియా ఇకమీదనైనా పోటీపడుతుందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి