జగన్‌ విశ్వాసఘాతుకం

‘నా ఎస్సీలు, నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా గొంతు చించుకునే జగన్‌ దృష్టిలో దళితులు, గిరిజనులకు ఉన్న విలువెంత? అవసరానికి వాడుకొని అది తీరాక తీసి పారేసే కూరలో కరివేపాకంత! రాష్ట్ర జనాభాలో 16.4 శాతం ఎస్సీలు, 5.3 శాతం ఎస్టీలు ఉన్నట్లు సర్కారీ లెక్కలు చెబుతున్నాయి.

Published : 16 Apr 2024 00:43 IST

‘నా ఎస్సీలు, నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా గొంతు చించుకునే జగన్‌ దృష్టిలో దళితులు, గిరిజనులకు ఉన్న విలువెంత? అవసరానికి వాడుకొని అది తీరాక తీసి పారేసే కూరలో కరివేపాకంత! రాష్ట్ర జనాభాలో 16.4 శాతం ఎస్సీలు, 5.3 శాతం ఎస్టీలు ఉన్నట్లు సర్కారీ లెక్కలు చెబుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా దామాషా మేరకు ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు దఖలుపడ్డాయి. గత ఎన్నికల వేళ వాగ్దానాల వృష్టి కురిపించి దళిత గిరిజన సీట్లలో రెండు తప్ప తక్కినవన్నీ కొల్లగొట్టిన జగన్‌- అధికారం చేపట్టిన వెంటనే అభాగ్య జనావళి పట్ల మహా ద్రోహానికి ఒడిగట్టారు. వైకాపా ప్రభుత్వంలో అందరికంటే ఎక్కువగా పేదవాడు బాగుపడతాడని, ఎస్సీ ఎస్టీలు ఎంత పేదరికంలో ఉన్నారో చెప్పాల్సిన పని లేదన్న జగన్‌ ఆ నిరుపేదలపైనే పిడిబాకు దూశారు. తొలి నాలుగేళ్లలోనే ఎస్‌సీ సబ్‌ప్లానులో రూ.23వేల కోట్లకు పైగా, ఎస్‌టీ ఉప ప్రణాళికలో రూ.6,547 కోట్ల కోతలు కోశారు. అరకొర కేటాయింపుల్నీ నవరత్నాలకు మళ్ళించి, దళిత గిరిజన సమాజాల అభ్యున్నతికి దారుణంగా గండి కొట్టారు. సీఎంగా జగన్‌ చేతివాటం అంతటితో ఆగలేదని, అప్పటికే అమలవుతున్న 27 పథకాల్ని రద్దుచేసి ఎస్సీ ఎస్టీల వెన్ను విరిచారని దళిత గిరిజన ఐకాస నేతలు 2022 డిసెంబరులోనే గళమెత్తారు. నాడు 12 అంశాలతో ఐకాస వెలువరించిన డిక్లరేషన్‌- జగనన్న పాపాలకు, వైకాపా ద్రోహాలకు నిలువుటద్దం. ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను మాల మాదిగ రెల్లి కుల కార్పొరేషన్లుగా విడగొట్టి, తన భృత్యుగణాలకు వాటిని అంటగట్టి, వాటి వ్యవస్థాగత నిర్మాణాన్ని, నిధుల్ని నిర్లక్ష్యం చేసిన నేరం నిశ్చయంగా జగన్‌దే! ‘దళిత గిరిజన బిడ్డలందరికీ మేనమామ’నంటూ వారి భవిష్యత్తుపై కత్తి దూసిన కంస మామ ప్రభుత్వం- వారి మేలిమి చదువులకు నిచ్చెన లాంటి పథకాలెన్నింటినో కర్కశంగా కాలరాసింది. అయినా లేనిది ఉన్నట్టు, చెయ్యనిది చేసినట్టు కనికట్టు చేసే గోబెల్స్‌ ప్రచారంతో జగన్‌ ముఠా మళ్ళీ బయల్దేరింది!

‘రాష్ట్రంలో దాదాపు ఆరు శాతం ఉన్న గిరిజనులకు మంచి చెయ్యాలని, వారిని సొంత కుటుంబం అనుకొని అడుగులు ముందుకు వేస్తున్నా’మని 2020 గాంధీ జయంతినాడు జగన్‌ సెలవిచ్చారు. నిజానికి దళితులతో పాటు గిరిజనం జీవన వ్యధల పట్ల- గాంధీగారి మూడు కోతుల్లానే కళ్లు చెవులు నోరు మూసుకొని పదవీకాలం ముగించేశారు. ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్‌ఆర్‌ పెళ్ళి కానుకగా లక్ష రూపాయలు అందిస్తామన్న జగన్‌- ఆ సాయానికి వధూవరులిద్దరూ పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని షరతు పెట్టారు. పర్యవసానంగా అంతకు ముందే చదువు ఆపేసినవాళ్లకు సాయం అందకుండా చేశారు. పాఠశాలల హేతుబద్ధీకరణ పేరిట అనేక స్కూళ్లను మూసేయడంతో, దూరాభారం దృష్ట్యా పేదింటి పిల్లలు చదువులకు దూరమై సర్కారీ సాయం కోల్పోయారు. ప్రమాదవశాత్తు ఎస్సీ ఎస్టీలు మరణిస్తే వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా అయిదు లక్షల రూపాయలు అందిస్తామన్న హామీ అమలులోనూ చావుతెలివి కనబరచింది జగన్‌ సర్కారు! కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తేనే సాయం అన్న మెలికతో ఆర్థిక భారాన్ని గణనీయంగా కుదించేసుకొంది! గతంలో అంబేడ్కర్‌ పేరిట ఉన్న విదేశీ విద్య పథకానికి తన పేరు తగిలించుకొన్న జగన్‌- కొత్తగా వివిధ నిబంధనల కొర్రీలు పెట్టారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజీ చేసే దళిత, గిరిజన విద్యార్థులకు ఫీజు తిరిగి చెల్లింపు నిలిపేశారు! కొత్త వైద్య కళాశాలల్లో 50 శాతం సీట్ల నుంచి డొనేషన్లు పిండుకోదలచిన జగన్‌ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లనూ తెగ్గోశారు. తన జమానాలో ఆదివాసులకు ఒక్క ఇల్లూ మంజూరు చెయ్యకుండా కేంద్రం కట్టిస్తున్న గృహాల ఘనతను తన ఖాతాలో వేసేసుకొంటున్నారు. గత తెలుగుదేశం హయాములో అమలైన స్వయం ఉపాధి రుణాలు, ఎస్సీలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ, భూమి కొనుగోలు పథకం లాంటి ఎన్నో మేలిమి స్కీముల్ని జగన్‌ కసిగా కాలరాశారు. అయిదేళ్లుగా తమ బాగోగుల్ని ఏమాత్రం పట్టించుకోని జగన్‌కు ఎస్సీ ఎస్టీలు కొర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందిప్పుడు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.