సామర్థ్యాలకు సానపట్టాల్సిన సమయం

ఐక్యరాజ్య సమితి జనాభా నిధి తాజా మదింపు ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశ జనసంఖ్య 144కోట్ల మైలురాయికి చేరనుంది. పొరుగున జన చైనా 142.5కోట్లకు పరిమితం కానుంది.

Published : 19 Apr 2024 01:21 IST

క్యరాజ్య సమితి జనాభా నిధి తాజా మదింపు ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశ జనసంఖ్య 144కోట్ల మైలురాయికి చేరనుంది. పొరుగున జన చైనా 142.5కోట్లకు పరిమితం కానుంది. చైనా, జపాన్‌ వంటివి అధిక వృద్ధ జనాభాతో సతమతమవుతున్నాయి. అదే ఇండియాలో, 65శాతం పౌరులు 35 ఏళ్లలోపువారే. యువరక్తంతో ఉప్పొంగుతున్న భారత్‌ ఆ అపార శక్తిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నదంటూ రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నరు రఘురాం రాజన్‌ ఆక్షేపించడం పూర్తిగా సహేతుకమే. దిద్దుబాటు చర్యల్లో భాగంగా మానవ వనరుల సామర్థ్యాల మెరుగుదల, ఉద్యోగ నిర్వహణ స్వరూప స్వభావాల్లో పాక్షిక మార్పులు అనుసరణీయాలంటున్న రాజన్‌- నైపుణ్యాల పెంపుదల కోసం అప్రెంటిస్‌షిప్‌ విధానానికి గట్టిగా ఓటేస్తున్నారు. 2047నాటికి భారత్‌ వృద్ధిచెందిన దేశంగా కాంతులీనాలంటే విద్య, ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని మూడు నెలలనాడు ఆయనే వ్యూహనిర్ణేతలకు హితవు పలికారు. కీలక రంగాల పరిపుష్టీకరణ, మౌలిక వసతుల పరికల్పన, ఉపాధి అవకాశాల పెంపుదల ముప్పేటగా సాగితేనే ప్రపంచ అతిపెద్ద ప్రతిభా కర్మాగారంగా ఇండియా ప్రశంసలందుకుంటుంది! తమవద్ద మెరికల్లాంటి నిపుణ శ్రామికులు 40కోట్లమంది ఉన్నారని ఆమధ్య చైనా సగర్వంగా ప్రకటించింది. ప్రతి పౌరుడికీ కనీస విద్యార్హత, ఆపై వ్యక్తిగత ఆసక్తి సహజసిద్ధ ప్రతిభల ప్రాతిపదికన వృత్తిపరమైన శిక్షణను అందించడంలో జర్మనీ, యూకే వంటివి చురుగ్గా రాణిస్తున్నాయి. దేశీయంగా అందుకు విరుద్ధ దృశ్యం తాండవిస్తోంది. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత తదితర అంశాల ఆధారంగా విశ్వసూచీ రూపొందిస్తారు. అలా తయారైన 134 దేశాల సూచీలో ఇండియా 103వ స్థానాన చతికిలపడింది. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనను ఉరకలెత్తించడంతోపాటు యువతలో ఉద్యోగార్హతల్ని ఇనుమడింపజేసే కార్యాచరణను ప్రభుత్వాలు సత్వరం పట్టాలకు ఎక్కించాలి!

విశ్వవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి నిరుద్యోగ భూతం కోరల్లో చిక్కి విలవిల్లాడే 80 కోట్లమందిలో అత్యధికులు భారతీయులే అయ్యుంటారన్న విశ్లేషణలు లోగడే కలకలం రేకెత్తించాయి. భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం, సీఐఐ(భారతీయ పరిశ్రమల సమాఖ్య), ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యామండలి) సంయుక్తంగా ఇండియా నైపుణ్యాల నివేదిక- 2022ను క్రోడీకరించాయి. అది దేశీయంగా 51శాతం మహిళలు, 46శాతం పురుషులకే ఉద్యోగం సంపాదించే సామర్థ్యం ఉన్నట్లు స్పష్టీకరించింది. ఏటా కోటీ 20లక్షల మందివరకు పట్టభద్రులు తయారవుతున్న దేశంలో మూడోవంతుమందికే ఉద్యోగార్హతలు ఉంటున్నాయంటే- నిరుద్యోగ రక్కసికి కోరలూ కొమ్ములూ మొలిపిస్తున్నది వ్యవస్థాగత నిర్లక్ష్యమేనన్న యథార్థం ప్రస్ఫుటమవుతోంది. భీతావహ భవితవ్య సూచికల్ని బదాబదలు చేయాలంటే- నాణ్యమైన విద్య, నైపుణ్యాలే కీలకాస్త్రాలు కావాలి. మున్ముందు లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, డేటాసైన్స్‌, వర్చువల్‌ రియాలిటీ తదితర కోర్సులే నెలవులు కానున్నాయంటున్నారు. అత్యధునాతన సాంకేతిక కోర్సులకు తగ్గట్లు ప్రాథమిక దశనుంచీ పాఠ్య ప్రణాళికల్ని పుస్తకాల్ని ప్రక్షాళించాలి. నైపుణ్య, ఉద్యోగ ఆధారిత బోధన తాలూకు ప్రాధాన్యాన్ని ఆకళించుకుని తెలంగాణ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సులకు సంబంధించి పరిశ్రమలతో అనుసంధానానికి, స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాయి. నైపుణ్య శిక్షణ కళాశాలల అవతరణకంటూ రాజస్థాన్‌, హరియాణా, ఒడిశా ప్రభృత రాష్ట్రాలకు ప్రత్యేక బృందాల్ని పంపించి హడావుడి చేసిన జగన్‌ సర్కారు ఆపై నిధుల కొరత సాకుతో చేతులెత్తేసింది. ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం వచ్చే 20, 30 ఏళ్లపాటు రంగాలవారీగా వాస్తవిక అవసరాలను, ఉపాధి అవకాశాలను శాస్త్రీయంగా మదింపు వేయాలి. అందుకనుగుణంగా చదువుల్ని సంస్కరించాలి. అదే అసలైన జాతినిర్మాణం అనిపించుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు