జనారోగ్యంతో చెలగాటం

సర్వరోగాలనూ చిటికెలో నయం చేస్తామని టముకేసుకుంటూ, ప్రజలకు పిచ్చి మందులు అంటగట్టి కాసులు కొల్లగొట్టే వ్యక్తులు, సంస్థలకు దేశంలో లోటు లేదు.  ఔషధాలూ సౌందర్యసాధనాల చట్టం, అభ్యంతరకర ప్రకటనల కట్టడి శాసనం వంటివి కాగితం పులులైన పర్యవసానంగా తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల బెడదా భారతావనికి తప్పడం లేదు.

Published : 27 Apr 2024 00:47 IST

సర్వరోగాలనూ చిటికెలో నయం చేస్తామని టముకేసుకుంటూ, ప్రజలకు పిచ్చి మందులు అంటగట్టి కాసులు కొల్లగొట్టే వ్యక్తులు, సంస్థలకు దేశంలో లోటు లేదు.  ఔషధాలూ సౌందర్యసాధనాల చట్టం, అభ్యంతరకర ప్రకటనల కట్టడి శాసనం వంటివి కాగితం పులులైన పర్యవసానంగా తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల బెడదా భారతావనికి తప్పడం లేదు. ‘జబ్బులను తగ్గిస్తాయంటూ పతంజలి ఆయుర్వేద మందులపై మీరు చేసిన ప్రచారంవల్ల దేశం మొత్తం మోసపోయింది’ అంటూ వివాదాస్పద యోగా గురువు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఇటీవల మండిపడింది. పతంజలి ఉత్పత్తుల ప్రచారాన్ని నిలిపివేయాలని న్యాయపాలిక ఆదేశించింది. జనం కళ్లకు గంతలు కట్టడంలో పతంజలి పాపాల చిట్టా పెద్దదే.  ఆవ నూనె, కేశ్‌కాంతి, దంత్‌కాంతి తదితరాలపై ఆ సంస్థ ప్రకటనలు ప్రజలను ఏమార్చేలా ఉన్నాయని అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) 2016లోనే తప్పుపట్టింది. అలా తీర్పిచ్చేందుకు ‘ఆస్కీ’కి అర్హతే లేదని పతంజలి వర్గాలు అప్పట్లో దులపరించేసుకున్నాయి. దరిమిలా తమ ఔషధాలు పలు వ్యాధులను మటుమాయం చేస్తాయంటూ ఆ సంస్థ బాధ్యులు డప్పు కొట్టుకోవడం, అల్లోపతి వైద్యంపై వారి ఆరోపణలు- ‘సుప్రీమ్‌’ ధర్మాగ్రహానికి కారణమయ్యాయి. ఆయుర్వేదం, హోమియోపతి వంటివి ఎప్పటినుంచో జనారోగ్యాన్ని సంరక్షిస్తున్నాయి. వాటి ముసుగులో ముంచెత్తుతున్న పనికిమాలిన మందులు- ప్రజలకు ప్రాణసంకటమవుతున్నాయి. ఒక హత్య చేసినవారికే ఉరిశిక్ష విధిస్తున్నప్పుడు- 140 కోట్ల మంది ఆయురారోగ్యాలతో చెలగాటమాడేవారు కచ్చితంగా కఠిన దండనకు అర్హులు!

హానికర ఉత్పత్తుల అమ్మకాలకోసం తప్పుడు ప్రకటనలు గుప్పించడం- మోసకారితనమే కాదు, దుర్మార్గం కూడా! అడ్వర్టైజింగ్‌ రంగ పితామహుడిగా వాసికెక్కిన బ్రిటిష్‌ దిగ్గజం డేవిడ్‌ ఓగిల్వీ హెచ్చరిక అది. లాభాల పేరాశతో దాన్ని పెడచెవిన పెట్టేవారికి సంకెళ్లు వేయాల్సింది ప్రభుత్వాలే. వినియోగదారుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేలా ప్రకటనలు ఉండకూడదని, ఆరోగ్య, పోషకాహార ప్రమాణాలను ఉల్లంఘించే ఉత్పత్తులకు ప్రచారం కల్పించకూడదని న్యూజిలాండ్‌ చట్టం గిరిగీస్తోంది. బొంకులతో జనాన్ని బుట్టలోవేసుకునే పెడపోకడలకు ప్రకటనదారులు దూరంగా ఉండితీరాలని యూకే, అమెరికా శాసనాలు నిర్దేశిస్తున్నాయి. చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తుల ప్రచారాన్ని చిలీ, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, నార్వే, మెక్సికో తదితర దేశాలు కఠినంగా నియంత్రిస్తున్నాయి. తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయగలిగే నిబంధనల రూపకల్పనకోసం న్యూజిలాండ్‌, యూకే, అమెరికా చట్టాలను కేంద్రం అధ్యయనం చేస్తున్నట్లు నాలుగేళ్ల నాడు కథనాలు వెలువడ్డాయి. ఆ క్రమంలోనే జనాన్ని బురిడీ కొట్టించే ప్రకటనల నియంత్రణకంటూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రెండేళ్ల క్రితం కొత్త మార్గదర్శకాలను వెలువరించింది. అమలులో అవి వట్టిపోతున్నట్లు ‘ఆస్కీ’కి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులే చాటుతున్నాయి. ప్రత్యామ్నాయ వైద్యవిధానాలకు చెందిన ఔషధాలుగా చలామణీ అవుతున్న వాటి బాగోగులపై మూడంచెల వ్యవస్థ ద్వారా నిఘా పెడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు సెలవిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలే కనపడటం లేదు.  జాతి జవజీవాలను హరిస్తున్న వంచకులకు తగిన శిక్షలూ కొరవడుతున్నాయి. మాయదారి ప్రకటనలతో జనం ఇల్లు ఒళ్లూ గుల్లచేసేవారి భరతం పట్టే చట్టాలెంత అవసరమో- వాటిని పటిష్ఠంగా అమలుచేసే యంత్రాంగం ఉండటమూ అంతే ప్రధానం. అవి కరవైన అవ్యవస్థే అనారోగ్య భారతావనికి అంటుకడుతోంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.